Begin typing your search above and press return to search.

వీసాలతో మ‌నోళ్ల‌కు షాకివ్వాలనుకున్న ట్రంప్‌ కు మైండ్ బ్లాక్‌

By:  Tupaki Desk   |   25 April 2018 5:20 PM GMT
వీసాలతో మ‌నోళ్ల‌కు షాకివ్వాలనుకున్న ట్రంప్‌ కు మైండ్ బ్లాక్‌
X

అమెరికాలో హెచ్1బీ వీసా పొందిన వారి జీవిత భాగస్వాములకు ఇచ్చిన వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే జరిగితే వేల సంఖ్యలో భారతీయులు ఉపాధిని కోల్పోవాల్సి వస్తుంది. దీనిపై ఈ వేసవిలోనే ఓ నిర్ణయం జరుగనుందని, ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికాలో హెచ్‌-4 వీసాలపై పని అనుమతి తొలగించాలని భావిస్తున్న ట్రంప్ సర్కార్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమంది అమెరికా చట్ట ప్రతినిధులు సహా ఐటీ ఇండస్ట్రీ ఈ ప్రతిపాదనపై మండిపడుతోంది. ఈ నిర్ణయం కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతారని… ఎన్నో కుటుంబాలపై ఇది ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

తమ అవసరం కోసం అత్యంత నైపుణ్యత కలిగిన విదేశీయులను చేర్చుకొనే అమెరికన్ కంపెనీలు వారికి హెచ్1బీ వీసాలను జారీ చేస్తాయి. వీరిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. వీరి జీవిత భాగస్వాములకు ఒబామా సర్కార్ ఓ ప్రత్యేక ఉత్తర్వు ద్వారా హెచ్-4 వీసాలు అందించి, అమెరికాలో పని చేసుకొనే అనుమతిని కల్పించింది. ఒబామా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా లక్ష మందికి పైగా లబ్ధి పొందారు. చాలామంది భారతీయులు ఈ ఉత్తర్వుల ఆధారంగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ఉత్తర్వులను రద్దు చేసేందుకు ట్రంప్ సర్కార్ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు నూతన నిబంధనలు, నూతన మార్గదర్శకాలు జారీ చేయనున్నామని, అవి ఇంతకుముందున్న నిబంధనలను సమీక్షించేవిగా లేక అధిగమించేవిగా ఉండే అవకాశం ఉన్నదని సిస్నా తన లేఖలో వివరించారు. తాము జారీ చేయబోయే నిబంధనలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతామని తెలిపారు. ట్రంప్ చేస్తున్న ఈ ప్రతిపాదనను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పలువురు శాసనకర్తలు కూడా ఈ విధానంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

హెచ్1బీ వీసా పొందినవారి జీవిత భాగస్వాములకు మునుపటి ఒబామా ప్రభుత్వం 2015లో హెచ్-4 వీసాలు జారీచేసి, చట్టబద్ధంగా పనిచేసుకొనే అవకాశం కల్పించింది. దీనిపై ట్రంప్ సర్కార్ ప్రస్తుతం కత్తికట్టింది. విదేశీయుల జీవిత భాగస్వాములకు ఇచ్చిన హెచ్-4 వీసాలను తొలిగించే ప్రతిపాదన తమ ప్రణాళికలో ఉన్నదని, ఇటువంటి అర్హత కల్పించిన 2015 నాటి నిబంధనను తిరుగదోడనున్నామని అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా, సెనేటర్ చక్ గ్రాస్లేకు రాసిన ఒక లేఖలో వెల్లడించారు. ట్రంప్ సర్కార్ తీసుకోనున్న ఈ నిర్ణయం 70వేల మందికి పైగా ఉన్న హెచ్-4 వీసాదారులపై ప్రభావం చూపనుంది. ఈ నేప‌థ్యంలో అమెరికా టాప్‌ కంపెనీలైన ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సహా మరికొన్ని కంపెనీలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని తెలిపాయి. ట్రంప్ ప్రతిపాదన కారణంగా హెచ్‌ 1 బీ వీసా ద్వారా ఉద్యోగం చేసే వారు ఆర్థిక అవసరాలకు తగినట్లు జీవించే పరిస్థితి లేదు. వారి భాగస్వాములకు ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండాల్సిందేనని అమెరికాలో ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. దీంతో ఈ ప్రతిపాదనపై ట్రంప్‌ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

కాగా, మైగ్రేషన్ పాలసీ ఇన్‌ స్టిట్యూట్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం - హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాములకు అమెరికా 71వేలకు పైగా పని అనుమతి పత్రాలు జారీ చేసింది. వీరిలో 90 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు. 2017 - జూన్‌ లో యూఎస్‌ సీఐఎస్ హెచ్1బీ జీవిత భాగస్వాములకు 71,287 ప్రాథమిక (రెన్యూవల్) ఉపాధి పత్రాలు జారీ చేసింది. ఈ పత్రాలు పొందిన వారిలో 94 శాతం మంది మహిళలే ఉండగా, వీరిలో భారతీయులు 93 శాతం మంది ఉన్నారు. చైనాకు చెందిన వారు కేవలం నాలుగు శాతం మంది మాత్రమే ఉన్నారని ఆ అధ్యయనం వెల్లడించింది.
======