టీడీపీ మౌత్ పీస్ లు వైఎస్సార్సీపీ దారిలోనా!

Thu Mar 14 2019 22:16:10 GMT+0530 (IST)

డొక్కా మాణిక్య వరప్రసాద్.. బహుశా గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు మీద ప్రభు భక్తిని చూపించిన వారిలో ముందు వరసలో ఉంటారు. బాబు భజన ఒక రేంజ్లో చేశారీయన. గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన డొక్కా అప్పట్లో మరీ ఈ రేంజ్ భజన పరులు కాదు. అయితే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో పూర్తి భజనపరుడుగా మారిపోయారీయన. అందుకు ప్రతిఫలంగా ఈయనకు నామినేటెడ్ పదవి దక్కింది.అయితే ఇప్పుడు చిత్రం ఏమిటంటే.. ఈయన కూడా తెలుగుదేశం పార్టీని వీడనున్నారట. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోయే నేతల జాబితాలో డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేరు వినిపిస్తూ ఉంది. గతంలో చంద్రబాబు భజన - జగన్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఈయన ఇప్పుడు ఎన్నికల ముందే వైసీపీ దారిలో సాగుతూ ఉండటం విశేషం.

ఇక వైసీపీ దారిలో ఉన్నారు మరో ఫిరాయింపు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు. ఇప్పటికే ఆయన కార్యకర్తలతో సమావేశం అయ్యి.. రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తనకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందని అంటూ వరుపుల కన్నీటి పర్యంతం అయ్యారు. తన ఆవేదనను చెప్పుకుని వాపోయారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు.

వీరే కాదు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరో బిగ్ వికెట్ పడటం ఖాయమని..రాయపాటి సాంబశివరావు సైకిల్ దిగి - ఫ్యాన్ కిందకు చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే రాయపాటి ఈ విషయం గురించి మీడియాకు లీకులు ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీలో పరిణామాల పట్ల ఈయన బాగా అసహనంతో ఉన్నట్టుగా భోగట్టా.