Begin typing your search above and press return to search.

హిందువుల కోసం ఏపీ గొప్ప నిర్ణయం

By:  Tupaki Desk   |   3 Dec 2016 11:09 AM GMT
హిందువుల కోసం ఏపీ గొప్ప నిర్ణయం
X
ఇటీలికాలంలో వరుసగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలతో ఇరుకున పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అనూహ్యమైన పథకాన్ని ప్రకటించింది. తీర్థయాత్రలకు వెళ్లే నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున‌ అవకాశం కల్పించనుంది. ఇప్పటివరకు మక్కా వెళ్లేందుకు ముస్లింలకు - జెరూసలెం వెళ్లేందుకు క్రైస్తవులకు ప్రభుత్వం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ తీర్థయాత్రలు చేయని నిరుపేద హిందువుల కోసం ‘దివ్యదర్శనం’ అనే కార్యక్రమాన్ని జనవరి 2 నుంచి అమలు చేయనుంది.

దివ్యదర్శనం కార్యక్రమంతో బడుగు - బలహీన వర్గాలకు తీర్థయాత్రల భాగ్యాన్ని కలిగిస్తోంది. దేవాదాయ శాఖ ప్రారంభిస్తున్న ఈ తీర్థయాత్రలకు వెళ్లదలచిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఆసక్తిగలవారు www.apendowments.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా దరఖాస్తును నేరుగా సంబంధిత ఎమ్మార్వో కార్యాలయంలోని డ్రాప్ బాక్స్ లో వేయవచ్చు. దివ్యదర్శనం కింద అరసవెల్లి - సింహాచలం - అన్నవరం - ద్వారకా తిరుమల - విజయవాడ దుర్గగుడి - అమరావతి - మంగళగిరి - త్రిపురాంతకం - శ్రీశైలం - మహానంది - అహోబిలం - కసాపురం - ఒంటిమిట్ట - జొన్నవాడ - శ్రీకాళహస్తి - తిరుపతి - కాణిపాకం క్షేత్రాల్లోని ఏదేని నాలుగు క్షేత్రాలకు తీసుకువెడతారు. తీర్థయాత్రలకు ఆర్టీసీ బస్ సర్వీసులను దేవాదాయ శాఖ వినియోగిస్తుంది. అయితే తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఎవరూ కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఏటా ఒక్కో జిల్లానుంచి పదివేల మందిని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. వసతి - భోజన సదుపాయాలతో పాటు దర్శనం కలిగించడం, తీర్థప్రసాదాలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది.ఈ పథకంలో ఎస్సీ - ఎస్టీ - బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని మాత్రమే తీసుకెళ్తారు. ముందుగా అనుకున్న విధంగా ఒక్కో జిల్లానుంచి పదివేల మందిని విడతల వారీగా తీర్థయాత్రలకు తీసుకెళ్లనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/