Begin typing your search above and press return to search.

ర‌ఘు విలాసానికి పరాకాష్ఠ ఇదేన‌ట‌

By:  Tupaki Desk   |   26 Sep 2017 6:04 AM GMT
ర‌ఘు విలాసానికి పరాకాష్ఠ ఇదేన‌ట‌
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్ట‌ర్ గొల్ల వెంక‌ట ర‌ఘు అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. కిలోల కొద్దీ బంగారం.. వెండిల‌తో పాటు క‌ట్ట‌ల‌కొద్దీ న‌గ‌దును చూసిన అధికారులు సైతం షాక్ తినే ప‌రిస్థితి. వంద‌లాది కోట్ల రూపాయిల ఆస్తుల్ని కూడ‌బెట్టిన ర‌ఘుకు సంబంధించిన షాకింగ్ అంశాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఈ నెలాఖ‌రులో రిటైర్ కానున్న ర‌ఘుకు సంబంధించి ఒక అంశాన్ని ఆయ‌న గురించి తెలిసిన వారు చెబుతున్నారు. ర‌ఘుకు కుక్క‌ల్ని పెంచే అల‌వాటు ఉంది. విజ‌య‌వాడ‌లోని ఆయ‌న ఇంటి ప‌క్క‌నే ఉన్న ఇంట్లో రెండు బీఎండ‌బ్ల్యూ కార్లు ఉన్నాయ‌ని.. వాటిల్లో ఒక కారు ర‌ఘు కుక్క‌గారి కోస‌మ‌ని చెబుతున్నారు. అధికారికంగా దీన్ని క‌న్ఫ‌ర్మ్ చేయ‌న‌ప్ప‌టికీ.. ఆయ‌న గురించి తెలిసిన వారంతా ఇది నిజ‌మేనంటున్నారు. ర‌ఘు విలాసాలు ఏ రేంజ్లో ఉంటాయ‌న‌టానికి ఈ ఉదంతం ఒక నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

నిన్న‌టి సోదాల్లో ర‌ఘుతో పాటు.. ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితంగా ఉండే శివ‌ప్ర‌సాద్ ఇంటితో పాటు.. మొత్తం 23 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డిన ఆస్తుల విలువ అధికారికంగానే రూ.100 కోట్ల‌కు పైనే ఉన్నాయ‌ని.. మార్కెట్ విలువ ప్ర‌కారం ఈ మొత్తం రూ.500 కోట్ల‌కు మించే ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఇక‌.. ర‌ఘు విలాసాలు ఏ రేంజ్లో ఉంటాయ‌న‌టానికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెబుతున్నారు. ఈ నెలాఖ‌రులో రిటైర్ కానున్న నేప‌థ్యంలో.. త‌న‌కు స‌న్నిహితంగా ఉండే వారికి విదేశాల్లో పార్టీ ఇవ్వ‌టానికి అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. పార్టీకి మూడు రోజుల ముందు మొత్తం ప్లాన్ అడ్డంగా తిరిగి ఏసీబీ అధికారుల వ‌ల‌లో చిక్కుకున్నారు.

ర‌ఘురామిరెడ్డికి ప్ర‌ధాన బినామీ అయిన శివ‌ప్ర‌సాద్ ఇంట్లో సంప‌ద‌ను చూసిన అధికారుల‌కు క‌ళ్లు చెదిరిపోయాయి. వాస్త‌వానికి శివ‌.. ఆయ‌న స‌తీమ‌ణి గాయత్రి ఇద్ద‌రూ ప్ర‌భుత్వ ఉద్యోగులే. కొద్దికాలం క్రితం తాను సంపాదించిన సంపాద‌న‌ను లెక్క‌లు చూసుకోవ‌టానికి స‌మ‌యం స‌రిపోలేదేమో కానీ.. ఆమె త‌న ఉద్యోగానికి ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ర‌ఘు విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లో ప‌ని చేసే కాలంలో శివ‌ప్ర‌సాద్‌.. ఆయ‌న స‌తీమ‌ణి గాయ‌త్రిల‌కు ప‌రిచ‌య‌మైంది. వీరి కుటుంబాల మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉండేవి. శివ‌ప్ర‌సాద్ విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఇంజ‌నీరింగ్ విభాగంలో డ్రాఫ్ట్ మ‌న్ గా ప‌ని చేస్తుంటే.. ఆయ‌న స‌తీమ‌ణి గాయ‌త్రి సైతం ఇదే ఆఫీసులో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏఈగా ప‌ని చేసేవారు.

త‌న అవినీతి సొమ్మును చేతుల‌తో లెక్కించ‌టానికి క‌ష్టంగా మారిందేమో కానీ.. శివ‌ నివాసంలో నోట్లను లెక్కించేందుకు ఏకంగా మెషీన్‌ను ఏర్పాటు చేసుకున్న వైనం అధికారుల‌కు షాకింగ్ గా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అవినీతి అన‌కొండ అక్ర‌మాస్తుల్ని లెక్కించ‌టానికి ఏసీబీ అధికారులు అదే మెషీన్‌ను వాడారు. ర‌ఘుకు బినామీగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌రో ప్ర‌భుత్వ ఉద్యోగి శివ ఇంట్లో నోట్ల‌ను లెక్కించే యంత్రాన్ని అధికారులు గుర్తించారు. ఏసీబీ దాడుల సంద‌ర్భంగా ప‌ట్టుబ‌డిన సొమ్మును లెక్కించ‌టానికి ద‌గ్గ‌ర్లోని బ్యాంకు నుంచి కౌంటింగ్ మెషిన్ల‌ను తీసుకొచ్చేవారు. తాజా ఉదంతంలో శివ ఇంట్లోనే నోట్ల మెషిన్ ఉండ‌టంతో బ్యాంకు నుంచి తీసుకురావాల్సిన అవ‌స‌రం త‌ప్పింది.

అవినీతి అన‌కొండ‌కు అండ‌గా నిలుస్తూ.. ఆయ‌న అవినీతిలో భాగ‌స్వామి అయిన శివ ప్ర‌సాద్ సైతం భారీగా సంప‌ద‌ను పోగేశారు. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఆయ‌న‌కున్న ఒక చిత్ర‌మైన అల‌వాటు గురించి అంద‌రూ చెబుతారు. త‌న రావ్ ఫిన్ వెంచ‌ర్స్ లో సాయిబాబా ఆల‌యాన్ని నిర్మించారు. అక్క‌డ‌కు భ‌క్తులు వ‌స్తుంటారు. అలా వ‌చ్చిన భ‌క్తుల్ని త‌న ఇంటికి తీసుకెళ్లి వారికి బాబా విభూతితోపాటు రూ.21 పొట్లాన్ని ఇస్తార‌ని చెబుతున్నారు. తాను చేసిన అక్ర‌మ సంపాద‌న‌లో రూ.21 చొప్పున ఇవ్వ‌టం ద్వారా పాపాన్ని క‌డుక్కునే లెక్క ఏదైనా ఉందేమో? అన్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.