Begin typing your search above and press return to search.

కేసీఆర్ ర్యాంకుల్లో ఆస‌క్తిక‌రంగా మారిన కోణం

By:  Tupaki Desk   |   28 May 2017 6:56 AM GMT
కేసీఆర్ ర్యాంకుల్లో ఆస‌క్తిక‌రంగా మారిన కోణం
X
కొన్ని సంద‌ర్భాల్లో.. కొన్ని విష‌యాలు కాస్త కొత్త‌గా క‌నిపిస్తుంటాయి. అంద‌రికి క‌నిపించే కోణంతో సంబంధం లేకుండా కొత్త కోణాన్ని చెబుతుంటారు. వాస్త‌వం మాట‌ను ప‌క్క‌న పెడితే..ఇలాంటి వాటిల్లో లాజిక్కు కీల‌కంగా మారుతుంది. తాజాగా అలాంటి ముచ్చ‌టే ఒక‌టి ఇప్పుడు వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. తాజాగా త‌మ ఎమ్మెల్యేల‌కు ర్యాంకులు లెక్క చెప్ప‌టం తెలిసిందే. గ‌తంలోనూ ఇలాంటి స‌ర్వేనే కేసీఆర్ నిర్వ‌హించారు. తాజాగా మ‌రోసారి స‌ర్వే చేయించిన కేసీఆర్‌..ఆ వివ‌రాల్ని పార్టీ నేత‌ల‌కు.. ఎమ్మెల్యేల‌కు స్వ‌యంగా చ‌దివి వినిపించారు.

స్వ‌యంగా ఎవ‌రికి వారు చెడ‌గొట్టుకుంటే త‌ప్పించి.. ప‌ని చేసే ఎమ్మెల్యేల‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌న్న ఆయ‌న‌.. పార్టీలో ఎవ‌రికెంత ర్యాంకు అన్న విష‌యాన్ని వివ‌రంగా చెప్పుకొచ్చారు. గ‌తంలో మాదిరి ఈ స‌ర్వేలోనూ టాప్ పొజిష‌న్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిలిస్తే.. త‌ర్వాతి స్థానంలో ఆయ‌న కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ నిలువగా.. మూడోస్థానంలో మాత్రం ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్ రావు ఉండగా నాలుగో స్థానంలో మాత్రం స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ రాజ‌య్య నాలుగో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్యేగా వ‌చ్చిన మార్కులు.. స‌ద‌రు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి ఎన్ని మార్కులు అన్న విష‌యాన్ని వివ‌రంగా వెల్ల‌డించారు.

ఈ మార్కులు.. ర్యాంకుల ముచ్చ‌టను కాసేపు ప‌క్క‌న పెడితే.. ఈ వ్య‌వ‌హారం మీద ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కేసీఆర్ నోటి నుంచి వ‌చ్చిన ర్యాంకుల్లో కీల‌క‌మైన మొద‌టి మూడు ర్యాంకుల పార్టీలో ఎవ‌రి సంగ‌తి ఏమిట‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

మొద‌టి స్థానంలో కేసీఆర్ నిల‌వ‌టం ఓకే అయినా.. రెండోస్థానంలో మంత్రి కేటీఆర్ నిలిచిన విష‌యాన్ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం ద్వారా.. పార్టీలో త‌న త‌ర్వాత ఎవ‌ర‌న్న విష‌యాన్ని తాజా ర్యాంకుతో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అవుతుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. కేటీఆర్‌ తో పోలిస్తే.. మంత్రి హ‌రీశ్ రావు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌రింత స‌న్నిహితంగా ఉంటార‌ని.. శాఖా ప‌రంగా చూసినా.. హ‌రీశ్ రావుతో పోలిస్తే.. కేటీఆర్ కాస్త వెనుక‌బ‌డి ఉంటార‌న్న అభిప్రాయం ప‌లువురు నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించిన ర్యాంకు.. మార్కుల విష‌యంలో మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా టాప్ త్రీ పైనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఏమైనా.. పార్టీ టాప్ క్యాడ‌ర్‌ కు సంబంధించి ఎవ‌రేంట‌న్న విష‌యాన్ని కేసీఆర్ త‌న మార్కుల‌తో.. ర్యాంకుల‌తో చెప్ప‌క‌నే చెప్పేశారా? అన్న‌ది సందేహంగా మారింది. ఇదే నిజ‌మైతే.. కేసీఆర్ ప‌క్క‌న పెట్టిన రాజ‌య్య నాలుగో స్థానంలో ఎలా నిలుస్తార‌న్న ప్ర‌శ్న‌ను కొంద‌రు వేస్తున్నారు. త‌మ ప‌ని తీరుతో దూసుకుపోతున్న‌రంటూ కేసీఆర్ నోట త‌ర‌చూ ప్ర‌శంస‌లు కురిసే తుమ్మ‌ల.. ఈటెల‌.. లాంటి వారు ర్యాంకుల్లో వెనుక‌బ‌డి పోవ‌టం ఏమిట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. తాజా మార్కులు.. ర్యాంకులు తెలంగాణ అధికార‌పక్షంలో స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/