Begin typing your search above and press return to search.

జగన్ - కేటీఆర్ భేటీ తర్వాత ఇదే హాట్ టాపిక్ !

By:  Tupaki Desk   |   19 Jan 2019 7:10 AM GMT
జగన్ - కేటీఆర్ భేటీ తర్వాత ఇదే హాట్ టాపిక్ !
X
ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ఏ రచ్చబండ దగ్గర చూసినా - ఏ నలుగురు సరదగా ముచ్చటించుకుంటున్నా ఇప్పుడు ఒకటే టాపిక్. అదే వైసీపీ అధినేత జగన్ - టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ. ఒకరు ఎన్నికల్లో విజేతగా నిలిచిన పార్టీకి సారథ్యం వహించే బాధ్యతలను భుజానికెత్తుకున్న వ్యక్తి. మరొకరు.. ఈసారి ఎలాగైనా తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రికార్డు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి. ఇలాంటి ఇద్దరు సమావేశమైతే.. సహజంగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది. పైగా.. మరో మూడు నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో ఈ అంశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే.. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? సామాన్య ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? జగన్‌ తో కేటీఆర్ భేటీ కావడం వైసీపీకి కలిసొచ్చే అంశమా లేక కష్టాలను కొని తెచ్చే అంశమా? టీడీపీ - జనసేన పార్టీలు ఈ పరిణామాన్ని ఏ కోణంలో చూస్తున్నాయి? ఇలాంటి సందేహాలు నెలకొన్న నేపథ్యంలో జగన్ - కేటీఆర్ భేటీపై ప్రత్యేక కథనం.

రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా జగన్ - కేటీఆర్ భేటీ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది. ఫెడరల్ ఫ్రంట్‌ పై వైసీపీ వైఖరిని తెలుసుకునేందుకే కేసీఆర్ తనను జగన్ వద్దకు పంపారని కేటీఆర్ చెబుతున్నప్పటికీ ఏపీ రాజకీయాలపైనే ఈ భేటీలో అంతర్గతంగా చర్చలు జరిగి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన కేసీఆర్ అందులో భాగంగానే వైసీపీతో అవగాహన కుదుర్చుకునేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారనేది కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. లోక్‌ సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్రంట్‌కు వైసీపీ మద్దతు - ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేసీఆర్ మద్దతు ఉంటుందనే విషయం ఈ భేటీతో దాదాపుగా స్పష్టమైందనే అభిప్రాయాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సామాన్య ప్రజల్లో ఈ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రాన్ని విభజించిందన్న కారణంగా కాంగ్రెస్‌ అడ్రస్‌ ను ఏపీ ఓటర్లు గల్లంతు చేశారని - అలాంటిది రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన టీఆర్ ఎస్ పార్టీ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేరని.. అలాంటి పార్టీని వెంటబెట్టుకుని వస్తున్న వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నాయి. అయితే.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీతో పాటు టీడీపీ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని... పొరుగు రాష్ట్రమైనప్పటికీ టీఆర్ ఎస్ పార్టీ హోదా విషయంలో ఏపీకి అండగా నిలిచిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అవసరమైతే ఏపీకి హోదా కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇలా హోదాపై సానుకూలంగా ఉన్న కేసీఆర్ ఏపీ పొలిటికల్ ఎంట్రీ తమకు లాభిస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది.

జగన్ కూడా కేటీఆర్‌ తో భేటీ అనంతరం పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రెండు రాష్ట్రాల ఎంపీలు కలిస్తే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావొచ్చని జగన్ వ్యాఖ్యానించారు. ఇక, జనసేనాని పవన్ ఈ పరిణామాలని నిశితంగా గమనిస్తున్నారు. ఆయన ఈ భేటీపై ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జగన్ - కేటీఆర్ భేటీ రాజకీయంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. అయితే.. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న ఏపీ ఓటర్లు ఎలాంటి తీర్పును ఇవ్వనున్నారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఎన్నికలకు సంబంధించిన కసరత్తును ఏపీలోని ప్రధాన పార్టీలు ఇంకా ప్రారంభించకముందే ఈ భేటీ ఎక్కడ లేని రాజకీయ వేడిని రాజేసింది.