Begin typing your search above and press return to search.

సంయమనాల్లేవ్.. సర్దుబాట్లు లేవ్..!

By:  Tupaki Desk   |   21 Feb 2018 6:07 AM GMT
సంయమనాల్లేవ్.. సర్దుబాట్లు లేవ్..!
X
సినిమా డైలాగును ఇక్కడ యథాతథంగా గుర్తు చేసుకోవడానికి వీల్లేదు. ‘‘మాటలున్నాయ్.. మాట్లాడుకోవడాలున్నాయ్..’’ కాకపోతే.. అన్నీ సూటిపోటి మాటలు. పరస్పర విమర్శనాస్త్రాలు. మిత్రపక్షాలు అంటే సాధారణంగా.. ‘‘యూ స్క్రాచ్ మై బ్యాక్.. ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్’’ తరహాలో ఒకరినొకరు కీర్తించుకుంటూ సాగిపోతూ ఉండాలి. కానీ ఏపీలోని రెండు పార్టీలూ ఎలా ఉంటున్నాయంటే.. ‘‘ఐ హిట్ యువర్ బ్యాక్.. యూ హిట్ మై బ్యాక్’’ అన్నట్టుగా పరస్పరం కీచులాడుకుంటున్నాయి.

మరో రకంగా చెప్పాలంటే.. భాజపా-తెదేపా తగాదాలు నెమ్మదిగా శృతిమించుతున్నాయి. ఇంకా మిత్రపక్షాలుగా కొనసాగుతూనే ఉన్నారు గానీ.. వీరి గొడవలు... కీచులాటల స్థాయినుంచి.. కొట్లాటలుగా పరిణమిస్తూ.. యుద్ధం గా తేలబోయేలా వాతావరణం కనిపిస్తోంది. తమ మిత్రపక్షం మీద నర్మగర్భపు విమర్శలు.. మళ్లీ సర్దుబాటు చేసుకోగల స్థాయి ఆరోపణల దశ వారు దాటిపోతున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ భాజపా నాయకుల్లో కొందరు.. తెలుగుదేశం మీద ఎలా పడితే అలా విరుచుకుపడుతుండేవారు. ప్రతిసారీ ఎవరో ఒకరు ఘాటుగా రిటార్టు ఇస్తే.. వారికి చంద్రబాబు క్లాస్ తీసుకోవడమూ.. సంయమనం పాటించాలని హితవు చెప్పడమూ జరిగేది. ఇప్పుడా రోజులు మారిపోయాయి. భాజపా వారు తమలపాకుతో తామొకటంటే.. తెదేపా వారు తలుపు చెక్కతో తామొకటి అంటున్నారు. ఎవ్వరూ కాసింత తగ్గి ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం.. ఈ వ్యవహారం కొలిక్కి వస్తే.. మళ్లీ మనం మిత్ర పక్షాలుగా కొనసాగాల్సిన వాళ్లం.. ఈలోగా కలిసి ఉండగల వాతావరణాన్ని దెబ్బతీసుకోకూడదు.. అనే స్పృహతో వ్యవహరించడం లేదు.

వేడెక్కుతున్న విమర్శలు మాత్రం.. వీళ్లిద్దరూ శాశ్వతంగా విడిపోయి - ఇక ప్రత్యక్షపోరాటానికి దిగుతారేమో అనిపించేలాగానే ఉన్నాయి. అయితే.. వీరు, బంధం తెగ్గొట్టుకోవడం కోసం- రాష్ట్రప్రయోజనాలు అనే మాటను వాడుకుంటున్నారా... రాష్ట్ర ప్రయోజనాలకోసం బంధం తెగ్గొట్టుకోడానికి సిద్ధపడుతున్నారా? అనే క్లారిటీ మాత్రం రావడం లేదు.

భాజపా నేతలు అమరావతికి సైంధవుల్లా మారారని - ఇప్పటిదాకా 1500 కోట్ల ముష్టి వేశారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలు చిన్నవేమీ కాదు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రతి పనీలో 80 శాతం కేంద్ర నిధులే ఉన్నాయని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వివరిస్తున్నారు. ఈ పరస్పరారోపణలు ఘాటెక్కే కొద్దీ.. బంధం పలుచన కావడం - తెగడం గ్యారంటీనా అనే అనుమానాలు సాగుతున్నాయి.