అమ్మ.. చిన్నమ్మల వీడియో బయటపెడతాడట

Fri Apr 21 2017 10:23:23 GMT+0530 (IST)

అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన అమ్మ జయలలిల.. నిర్జీవంగా మాత్రమే అందరికి దర్శనమిచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందే రోజుల్లో అమ్మ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారన్న విషయం.. ఆమెకు చికిత్స అందించిన వైద్యులు.. నర్సులు.. చిన్నమ్మ శశికళకు మినహా మరెవరికీ తెలీదని చెప్పాలి. రాహుల్ తో సహా వీవీఐపీలు ఆసుపత్రికి వెళ్లినా.. చిన్నమ్మను చూసి.. ఆమెను పలకరించి వచ్చారే కానీ అమ్మను చూసేందుకు.. ఆమెను పరామర్శించే అవకాశమే రాలేదు. తమ కారణంగా అమ్మకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్న మాటకు జాగ్రత్త పడిన ప్రముఖులు.. అపోలోకు వెళ్లారే కానీ.. అమ్మను పరామర్శించి మాత్రం రాలేదు.ఇప్పుడు ఇదే చిన్నమ్మ వర్గానికి పెద్ద కష్టంగా మారింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందినంత కాలం.. తమను ఎంత దూరం పెట్టినా కిక్కురమనకుండా ఉన్న పన్నీర్ అండ్ కో.. ఇప్పుడు మాత్రం అమ్మ మరణంపై పలు సందేహాలు వ్యక్తం చేయటం తెలిసిందే. నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే.. అమ్మ మరణించిన తర్వాత కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. నిజంగా అమ్మ మరణం మీద అనుమానాలు ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలు సంపాదించటం అంత కష్టమైన విషయం కాదు.

కానీ.. చిన్నమ్మతో చెడే వరకూ అమ్మ మరణంపై అనుమానాల్ని వ్యక్తం చేయని పన్నీర్ సెల్వం.. ఆ తర్వాత మాత్రం తరచూ అమ్మ మరణం గురించి చెబుతూ.. ఎన్నో అనుమానాల్నివ్యక్తం చేయటం కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఇదే తీరులో సాగిన ఈ వ్యవహారానికి తొలిసారి చిన్నమ్మ వర్గం కాస్తంత ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. శశికళ బంధువు దివాకరన్ కుమారుడు జయానంద్ తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యల్ని ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. హత్య ఆరోపణలు చేసినప్పటికీ అమ్మ చికిత్స ఫోటోల్ని బయట పెట్టకపోవటానికి కారణం.. అమ్మను పచ్చగౌను దుస్తుల్లో ప్రత్యర్థులు చూపించకూడదన్న ఉద్దేశమే తప్పించి మరొకటి లేదన్నారు.

త్యాగమూర్తి చిన్నమ్మ చేసిన పని కారణంగానే సింహాన్ని సింహం మాదిరి స్వర్గ లోకం పాలించేందుకు రాచమర్యాదలతో పంపించామని.. కానీ పన్నీరు మాత్రం ఓట్ల కోసం పురట్చితలైవిని శవపేటికలో పెట్టి ప్రచారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. నిజం నిప్పు లాంటిదని.. ఏదో ఒకరోజు అమ్మ.. చిన్నమ్మ ల మధ్య ఆసుపత్రిలో జరిగిన సంభాషణలు బయటకు వస్తే.. పన్నీర్ సెల్వం అండ్ కోలను ఏం చేయాల్సి ఉంటుందో? అంటూ తన మాటల్ని పూర్తి చేయకుండా క్వశ్చన్ మార్క్ తో వదిలేశారు. ఆసుపత్రిలో అమ్మకు చేసిన చికిత్స పై ఇంతకాలం పెదవి విప్పని చిన్నమ్మ వర్గం తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/