దినకరన్ వర్గం రెచ్చిపోయిందిగా

Thu Sep 14 2017 16:59:45 GMT+0530 (IST)

తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అమ్మ జయలలిత మరణం తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పార్టీకి ఏదో ఒక రూపంలో ఆటు పోట్లు తగులుతూనే ఉన్నాయి. తొలుత పన్నీర్ సెల్వంతో ప్రారంభమైన ఈ వివాదం.. చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్లడంతో యూటర్న్ తీసుకుంది. పళనిస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి పరప్పన అగ్రహారం జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని భావించిన శశికళకు పళని వర్గం పెద్ద దెబ్బేసేసింది. ఓపీఎస్‌ను మచ్చిక చేసుకుని పళనిస్వామి.. శశికళను పార్టీ నుంచి గెంటే శారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి అంటూ ఉంటే ఆమె ఒక్క అమ్మేనని జయను మించిన ప్రధాన కార్యదర్శి లేరని పేర్కొంటూ రెండు రోజుల కిందట తీర్మానం చేశారు.

అదేసమయంలో టీటీవీ దినకరన్ పైనా పళని - పన్నీర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే వేటు వేసింది. ఆయనను పార్టీ పదవుల నుంచి తొలగించి అధికారాలకు కత్తెర వేసింది. వెయ్యి మంది దినకరన్‌లు వచ్చినా.. ఏమీ చేయలేరని ఈ సందర్భంగా పళని హెచ్చరించడం గమనార్హం. ఇక ఈ నిర్ణయంపై దినకరన్ వర్గం తీవ్రస్థాయిలో మండిపడింది.  దినకరన్‌కు మద్దతిస్తున్న 19 మంది ఎమ్మెల్యేలు.. పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలంటూ గురువారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పళని ప్రభుత్వం మైనార్టీలో ఉందని తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం అని పిటిషన్ లో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

 గవర్నర్ జాప్యం చేస్తున్నందునే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని వారు తెలిపారు. అదేసమయంలో దినకరన్ వర్గంలోని మరికొందరు ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. సర్వసభ్య సమావేశంలో వీకే శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ వారు ఈసీకి విజ్ఞప్తి చేశారు. త్వరలో శశికళను సంప్రదించి తాము అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తామని దినకరన్ వర్గ ఎమ్మెల్యే విజిల సత్యనంత్ తెలిపారు. దీంతో ఇప్పుడు సమసిపోయిందని భావించిన వివాదం మళ్లీ తెరమీదకి వచ్చింది. ఇదిలావుంటే మరో పక్క డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్ కూడా పళని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. దీంతో తమిళనాడులో నెలకొన్న రాజకీయ అస్థిరత ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు.