Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ కు డిగ్గీ రాజా ఫుల్ సపోర్టు

By:  Tupaki Desk   |   24 Aug 2016 9:22 AM GMT
ఆ హీరోయిన్ కు డిగ్గీ రాజా ఫుల్ సపోర్టు
X
పదునైన విమర్శలకు పేరొందిన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి మోడీపై విరుచుకుపడ్డారు. ఛాన్సు దొరికితే చాలు ప్రతి విషయాన్నీ మోడీతో ముడిపెట్టే ఆయన తాజాగా కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ - నటి - కాంగ్రెస్ నేత రమ్య వ్యవహారంలోకి మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. దానిపై ట్విట్టర్లో కామెంట్లు చేశారు. మాజీ ఎంపీ రమ్య పాకిస్థాన్‌ ను పొగిడినందుకు ఆమెపై దేశద్రోహం కేసు నమోదైన విషయంలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుటుంబంలో వివాహ రిసెప్షన్‌ కు వెళ్లొచ్చు కాని.. రమ్య పాకిస్థాన్‌ గురించి మంచిగామాట్లాడితే దేశ ద్రోహం ఎలా అవుతుందని ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా ఇటీవల భారత్‌ - పాక్‌ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ పాకిస్థాన్‌ ను నరకంతో పోల్చారు. కానీ... మాజీ ఎంపీ రమ్య మాత్రం పాకిస్థాన్‌ ను తెగ పొగిడేశారు. ఆమె పాక్ ను పొగిడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇస్లామాబాద్‌ లో జరిగిన సార్క్‌ సమావేశానికి హాజరైన ఆమె పాకిస్థాన్‌ ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది వివాదంగా మారి పలువురు ఆమె క్షమాపణలు చెప్పాలని కోరగా అందుకు రమ్య నిరాకరించింది.

ఈ విషయంలో జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలెవరూ జోక్యం చేసుకోనప్పటికీ దిగ్విజయ్ మాత్రం ట్విట్టర్ లో దీనిపై స్పందించారు. మూణ్నెళ్ల కిందట ముగిసిపోయిన మోడీ అధ్యాయాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. అప్పట్లో మోడీ ఆప్ఘనిస్థాన్ పర్యటనకు వెళ్లి అక్కడినుంచి తిరుగు ప్రయాణంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాకిస్థాన్ లో దిగి నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లారు. అప్పటికి నవాజ్ ఇంట్లో వివాహ వేడుక జరుగుతుండడంతో పెళ్లి కుమార్తెకు బహుమతులు ఇవ్వడమే కాకుండా నవాజ్ కు కూడా అందమైన తలపాగాను బహుకరించారు. నవాజ్ ఆ తలపాగాను ధరించే వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదంతా చేసిన మోడీతో పోల్చితే రమ్య పాక్ మంచిదే అనడం తప్పెలా అవుతుందని డిగ్గీరాజా వాదిస్తున్నారు. దీంతో రమ్యకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి గట్టి సపోర్టు దొరికనట్లయింది.