Begin typing your search above and press return to search.

డిగ్గీ రాజా ఆ పని చేయగలడా?

By:  Tupaki Desk   |   13 Oct 2015 3:01 PM GMT
డిగ్గీ రాజా ఆ పని చేయగలడా?
X
'పోగా మిగిలింది ఆస్తి' అనే సిద్ధాంతం కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి తెలుసోలేదో గానీ, మొత్తానికి మిగిలింది కూడా మన ఆస్తి కాదని.. అది కూడా చంచలమైన స్వభావంతో.. ఏనాటికైనా మన ప్రత్యర్థులకు చెందిపోవచ్చునని నిత్యం భయపడుతూ బతకడం కంటె.. దయనీయమైన పరిస్థితి మరొకటి ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గురించి.. అధిష్ఠానం అదే రీతిగా ఆందోళన చెందుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో తమ పార్టీ ఎటూ సమాధి అయిపోయింది. ఆ సమాధినుంచి పునరుత్థానం అనేది ఎన్నటికి జరుగుతుందో ఏమో తెలియదు. అలాంటిది కనీసం.. ప్రాణవాయువు మిగిలి ఉన్న తెలంగాణలోనైనా కాపాడుకోవాలని వారు ఆరాటపడడంలో తప్పేం లేదు. కాకపోతే.. వారికి సానుకూల పరిస్థితులే కనిపించడం లేదు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తే ఈ రాష్ట్రంలో తమకు ఇక ఎప్పటికీ తిరుగులేకుండా ఉంటుందని కక్కుర్తి పడినందుకు కాంగ్రెస్‌ బాగానే పశ్చాత్తాప పడుతున్నట్లున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులు కూడా దశాబ్దాల పార్టీ అనుబంధాన్ని తోసిరాజని తెరాస తీర్థం పుచ్చుకుంటూ ఉండడమే అందుకు కారణం. ఒక రకంగా చెప్పాలంటే.. కాంగ్రెస్‌ పార్టీలో సాక్షత్తూ పార్టీ అధినేతల్ని కూడా బజార్న తిట్టి, మళ్లీ అధికారం చెలాయించగల బీభత్సమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా.. అవేమీ లేని.. కేసీఆర్‌ కుటుంబ మోనోపలీ ఉండే తెరాసలోకి వెళ్లిపోతుండడం అధిష్ఠానానికి అర్థం కావడం లేదు.

గెలిచిన ఎమ్మెల్యేలకు వలవిసిరి కేసీఆర్‌ ఆకర్షించారనే అనుకుందాం. ఇప్పుడు ఓడిన ఎమ్మెల్యేల వంతు కూడా వచ్చింది. చివరికి భాగ్యనగరంలో పార్టీకి బలం అని వారు అనుకునే దానం నాగేందర్‌ వంటి వారు కూడా వెళ్తారనే ప్రచారం పార్టీని కలవరపెడుతోంది. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడానికి అధిష్ఠానం నుంచి దిగ్విజయసింగ్‌ రానున్నట్లు తెలుస్తోంది.

డిగ్గీరాజా హైదరాబాద్‌ టూర్‌ ప్రోగ్రాం ఖరారైంది. ఒకవైపు రాష్ట్రమంతా రకరకాల సమస్యలతో అట్టుడుకుతోంటే.. పాతబస్తీలో 19వ తేదీన శాంతిర్యాలీ నిర్వహిస్తాం అంటూ డిగ్గీరాజా సెలవిచ్చేశారు. వారి ప్రయాస మొత్తం జీహెచ్‌ ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే అని క్లియర్‌ గానే అర్థమవుతోంది. కాకపోతే.. పైకి శాంతి ర్యాలీ పేరు చెప్పుకుని హైదరాబాద్‌ వచ్చి, తెరాసలోకి వెళ్లిపోవాలనుకుంటున్న తాజా బృందాన్ని బుజ్జగించాలని డిగ్గీ ఎజెండా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దానం నాగేందర్‌ వెళ్లిపోతున్నారంటే.. కంగారుపడి.. డిగ్గీరాజా ఆయనతో ఫోన్లోనే మాట్లాడి తొందరపాటు నిర్ణయం వద్దని చెప్పినట్లుగా సమాచారం. ఆ మేరకు దానంతో నేరుగా కూడా మాట్లాడి.. పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని.. అక్కడ స్వేచ్ఛ ఉండదని హెచ్చరించి.. కాంగ్రెస్‌ వీడిపోకుండా చూడడమే ప్రధాన ఎజెండాగా డిగ్గీ వస్తున్నారని అంటున్నారు. మరి ఆయన ఏమేరకు సక్సెస్‌ అవుతారో చూడాలి.