Begin typing your search above and press return to search.

ఈ ఇద్ద‌రు సీనియర్ల‌తో భ‌లే చిక్కు!

By:  Tupaki Desk   |   3 Dec 2016 10:39 AM GMT
ఈ ఇద్ద‌రు సీనియర్ల‌తో భ‌లే చిక్కు!
X
అధిష్టాన పెద్ద‌ల‌కు అత్యంత స‌న్నిహితులు - రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ - బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీరే వేరు. వీలు చిక్కిన‌పుడ‌ల్లా ప్ర‌తిపక్షాల‌ను విమ‌ర్శించ‌డంతో పాటు అవ‌స‌రం అయితే సొంత పార్టీపైనా అసంతృప్తి వ్యక్తం చేయ‌డంలో ఈ నేత‌లు ముందుంటారు. తాజాగా వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ఇదే రీతిలో రియాక్ట‌య్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ ట్విట్టర్ అక్కౌంట్ హ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ వ‌చ్చే ఒలింపిక్ క్రీడలలో హ్యాకింగ్ ను కూడా చేర్చాలని పంచ్ వేశారు. హాకింగ్ ను ఒలింపిక్స్ లో చేరిస్తే భారత్ కు పతకాల కరవు తీరిపోతుందని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ లో హ్యాకింగ్ ను చేరిస్తే అందులో మనకు బంగారు పతకం ఖాయమని ఎద్దేవా చేశారు. రాహుల్ గాందీ ట్విట్టర్ అక్కౌంట్ హ్యాక్ అయిన రోజుల తరువాత దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక సొంత పార్టీ నిర్ణ‌యాలు అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా వాటిపై స్పందించే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా నోట్ల రద్దుపై మ‌ళ్లీ త‌న‌దైన విశ్లేష‌ణ చేశారు. దేశంలో నల్లధనం - అవినీతి అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఈ నిర్ణయం వల్ల పేదలు - సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు - ఇక్కట్లను సత్వరమే తీర్చకుంటే ఈ నిర్ణయం వల్ల వచ్చిన ప్రజాదరణ ప్రజావ్యతిరేకతగా మారే ప్రమాదం ఉందని స్వామి కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

మ‌రోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై యోగా గురు బాబా రాందేవ్ ప్రశంసల జల్లు కురిపించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ అయిన రాం దేవ్ అనంతరం విలేకరులతో మాట్టాడారు. సామాజిక - రాజకీయ రంగాలలో లాలూ ప్రసాద్ యాదవ్ అవసరం ఎంతో ఉందని అన్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. లాలూ సతీమణి రబ్రిదేవి మాట్లాడుతూ రామ్ దేవ్ తన భర్తను పరామర్శించేందుకు వచ్చారనీ, ఇటీవల అనారోగ్యానికి గురైన తన భర్తను పరామర్శించి యోగా చేయాల్సిందిగా సూచించారని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/