Begin typing your search above and press return to search.

ఆలస్యం అయిపోయిందేమో రాజా?

By:  Tupaki Desk   |   21 Oct 2016 6:47 AM GMT
ఆలస్యం అయిపోయిందేమో రాజా?
X
టైం ని కాదు టైమింగ్ ని నమ్ముకోవాలనే విషయం అన్నిరంగాల్లోనూ, ముఖ్యంగా రాజకీయాల్లో అతిముఖ్యమైన విషయం. ఆ సమయానికి స్పందిస్తే ఆ స్పందనకు అందం, అర్ధం! అలా కాకుండా దొంగలు పడ్డ ఆరునెళ్ల తర్వాత స్పందించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చనే అనుకోవాలి. ఈ విషయంలో కచ్చితంగా రాజకీయ నాయకులకు టైమింగ్ చాలా ప్రాముఖ్యం. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే పాకిస్థాన్ ఆర్టిస్టులు, వారు నటించిన సినిమాల నిషేదం అనే అంశాలపై తాజాగా, కాదు చాలా ఆలస్యంగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఈ క్రమంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు!!

పాకిస్తాన్ ఆర్టిస్టులమీద, బాలీవుడ్ లో వారు నటించిన సినిమాల మీదా జరుగుతున్న వివాదంపై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నిర్మాతలు, ఆర్టిస్టులకు తన మద్దతు కచ్చితంగా ఉంటుందని, కేవలం పాక్ ఆర్టిస్టులను మాత్రమే ఎందుకు నిషేధిస్తున్నారని ట్వీట్లు చేశారు. అంతగా అవసరముకుంటే, దాయాది పాకిస్థాన్ ను కేవలం సినిమాల విషయంలో మాత్రమే నిషేధించడం దేనికి... అన్ని రంగాల్లోనూ నిషేదిస్తే తప్పేమి ఉందని ప్రశ్నించారు. ఇరుదేశాల మధ్య ఎన్నో సమస్యలు ఉండగా కేవలం కేవలం పాకిస్థాన్ కళాకారులు మాత్రమే ఇబ్బందులకు గురవుతున్నారని డిగ్గీ రాజా పేర్కొన్నారు. ఇదే క్రమంలో భారత్ - పాక్ దేశాలకు ఆర్టిస్టులే బాండ్ అంబాసిడర్లని అని వారిని కొనియాడిన డిగ్గీ రాజా... ఈ విషయాలపై వరుస ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్న చాలా మందితో పాటు రాజకీయ నాయకులు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే ఉంది అసలు సమస్య... ఈ విషయంపై రసవత్తరమైన చర్చ నడుస్తోన్న సమయంలో డిగ్గీ రాజా స్పందించి, తన అభిప్రాయాన్ని చెబితే బాగుండేది, అంతే కానీ ఇప్పుడు స్పందించడం చాలా ఆలస్యం అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే... "ఏ దిల్ హై ముష్కిల్" సినిమా వివాదంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ క్లియర్ చేసి, హామీ ఇచ్చేశారు. దీంతో పాకిస్థాన్ నటులపైనా, వారి సినిమాలపైనా బీజేపీ, కేంద్రప్రభుత్వం ల వెర్షన్ పై కొంత క్లారిటీ వచ్చేసినట్లే. ఇలాంటి సమయంలో డిగ్గీ రాజావారు స్పందించడం వల్ల పెద్దగా ప్రయోజనం కొత్తగా చేకూరే అవకాశం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.