Begin typing your search above and press return to search.

బాబుకు కేసీఆర్ కున్న పే..ద్ద తేడా గమనించారా?

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:18 AM GMT
బాబుకు కేసీఆర్ కున్న పే..ద్ద తేడా గమనించారా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరో రెండు.. మూడు రోజుల వరకూ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే.. గడిచిన వందేళ్ల చరిత్రలో రెండోసారి ఒకే రోజులో అత్యధిక వర్షపాతం హైదరాబాద్ మహానగరంలో నమోదైంది. దీంతో వందలాది అపార్ట్ మెంట్లు.. వేలాదిమంది ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.

మరోవైపు.. ఏపీలోని గుంటూరు.. కృష్ణాతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ఒకే సమయంలో ఒకేలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇద్దరు చంద్రుళ్లు ఎలా వ్యవహరించారన్న విషయాన్ని చూస్తే ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే.. ఏపీ ముఖ్యమంత్రి వర్షాల విషయం తెలిసి.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న విషయం తెలిసిన వెంటనే.. పరామర్శల ప్రోగ్రాంను షురూ చేస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పాలి.

ఓపక్క హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున ప్రజలు వరద నీటితో ఇక్కట్లకు గురి అవుతున్నా.. కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులకు ధైర్యాన్ని కలిగించి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కానీ.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం కాలు బయటకు పెట్టలేదు. బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించలేదు. అధికారులతో రివ్యూ నిర్వహించి.. మీడియా సమావేశంలో వరద నీరు పోటెత్తటానికి కారణం అక్రమ నిర్మాణాలే అంటూ తీవ్రంగా ఫైర్ అయి.. నాలాల మీద కట్టిన అక్రమ కట్టడాల్ని యుద్ధప్రాతిపదికన తీసేస్తామని అల్టిమేటం జారీ చేశారు.

ఓవైపు చంద్రబాబు పరామర్శలతో బాధితుల మనసుల్లో స్థానం సంపాదించేందుకు కిందామీదా పడుతుంటే.. మరోవైపు కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం చూస్తే.. పేర్లు కలిసినా.. ఒకేలాంటి ఇష్యూను ఇద్దరు చంద్రుళ్లు డీల్ చేసే తీరులో ఎంత వ్యత్యాసం ఉందో ఇట్టే తెలుస్తుంది.