Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ఇలా జ‌రిగితే.. సీన్ ఇలా ఉండేది?

By:  Tupaki Desk   |   12 Feb 2019 6:35 AM GMT
తెలంగాణ‌లో ఇలా జ‌రిగితే.. సీన్ ఇలా ఉండేది?
X
రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతుంటే.. ఆంధ్రోళ్లు విల‌విల‌లాడిపోయారు. అయితే.. ఈ బాధ అంతా హైద‌రాబాద్ పోతున్నందుకే అన్న నింద ప‌డినా.. దానికి ధీటుగా స‌మాదానం చెప్పింది లేదు. నిజానికి హైద‌రాబాద్ కోస‌మే ఆంధ్రోళ్లు అంత‌గా ఆరాట‌ప‌డితే.. తాము పోగొట్టుకుంటున్న సొత్తును సొంతం చేసుకోవ‌టానికి పోరాటాలు చేసే వారు క‌దా? నిజంగానే ఆంధ్రోళ్ల‌కు హైద‌రాబాద్ కావాలి.ఎందుకంటే.. ఉమ్మ‌డి రాష్ట్రానికి ప్ర‌తీక హైదరాబాద్. అందుకోస‌మే త‌ప్పించి హైద‌రాబాద్ ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌తో ఏదో లాభం పొందాల‌న్న ఆశ ఆంధ్రోళ్ల‌కు లేకున్నా.. ఆ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. వారు ప‌డిన వేద‌నకు సైతం వ‌క్ర‌భాష్యం చెప్పినోళ్లే కానీ.. వారి ఆరాటాన్ని.. తెలంగాణ‌తో క‌లిసి ఉండ‌టానికి ప‌డిన త‌ప‌న‌ను ప‌ట్టించుకున్న‌ది లేదు.

ఆంధ్రోళ్ల ఆకాంక్ష‌ల్ని.. ఆశ‌ల్ని ప‌ట్టించుకున్న రాజ‌కీయ పార్టీ కానీ.. ఉద్య‌మ సంస్థతో పాటు.. ఏ ప్ర‌ముఖుడు.. మేధావి దానికి ద‌న్నుగా నిల‌బ‌డింది లేదు. తెలంగాణ‌కు ఆంధ్రాకు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఇదే. తెలంగాణ పోరాటం కోసం కేసీఆర్ ఉన్నారు. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా.. రాజ‌కీయంగా చాలానే కోణాలుఉండొచ్చు. అధికారాన్ని చేజిక్కించుకునే స్వార్థం ఉండొచ్చు. కానీ.. ఉద్య‌మం నీరు కార‌కుండా ఉండ‌టం.. తెలంగాణ ఆకాంక్ష‌లు చెదిర‌పోకుండా.. చింద‌ర‌వంద‌ర కాకుండా చేయ‌ట‌మే కాదు.. ఉద్య‌మ స్ఫూర్తిని నింపుతూ.. ఆ భావ‌జాలం ఉన్న వారంద‌రిని ఏకం చేసే మంచి ప‌ని చేశారు.

అలాంటిదేమీ ఆంధ్రాలో క‌నిపించ‌దు. ఒక‌రిద్ద‌రు ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం ఉద్య‌మాలు చేసినా.. వారెవ‌రూ యావ‌త్ ఆంధ్రాని క‌దిలించే శ‌క్తి ఉన్న వారు కాదు. అందుకు త‌గ్గ క‌స‌ర‌త్తు చేసింది క‌నిపించ‌దు. దీనికి తోడు ఆంధ్రోళ్ల మైండ్ సెట్ కూడా కార‌ణంగా చెప్పాలి. ఆంధ్రా అన్న‌ది ఒక్క‌టిగా క‌నిపించినా.. ప్ర‌జ‌ల్లో ఉత్త‌రాంధ్ర‌.. గోదావ‌రి జిల్లాలు.. కోస్తా.. సీమ అంటూ త‌మ‌లో తాము ముక్క‌లు ముక్క‌లు చేసుకోవ‌టం.. వేర్వేరుగా మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తుంది. తెలంగాణ‌లో అలాంటిది క‌నిపించ‌దు. వినిపించ‌దు కూడా. తెలంగాణ ప్ర‌యోజ‌నాల ముందు ప్రాంతాలు.. వ‌ర్గాలు..అన్ని చిన్న‌వే. కానీ.. ఆంధ్రాలో అలా ఉండ‌దు. అదే ఆంద్రాకున్నద‌రిద్రంగా చెప్పాలి. ఇదే.. ఆంధ్రోళ్ల‌ను కుట్ర‌దారులుగా.. స్వార్థ‌ప‌రులుగా.. దోచుకునే వారిగా పుస్త‌కాల్లో అచ్చేసే వ‌ర‌కూ వెళ్లింది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎవ‌రైనా ప్రాణ‌త్యాగం చేస్తే.. తెలంగాణ స‌మాజం మొత్తం త‌మ ఇంటి వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లుగా క‌దిలిపోయేవారు.ప్రాణ‌త్యాగం చేసేలా చేసిన వారిపై నిప్పులు చెరిగేవారు. పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఏక‌మ‌య్యేవారు. ఏపీ హోదా సాధ‌న కోసం సిక్కోలుకు చెందిన అర్జున రావు అనే దివ్యాంగుడు ఢిల్లీలో సూసైడ్ చేసుకోవ‌టం తెలిసిందే. ఇలాంటిదే తెలంగాణ ఉద్య‌మం వేళ జ‌రిగి ఉంటే.. తెలంగాణ మొత్తం ర‌గిలిపోయేది. ఆవేద‌న‌తో ఊగిపోయేది. ధ‌ర్నాలు.. బంద్ ల‌తో అట్టుడికిపోయేది. నిర‌స‌న‌ల‌తో హోరెత్తేది. కానీ.. ఆంధ్రాలో అదేమీ క‌నిపించ‌దు. ఇంద‌కు మించిన తేడా ఏం చెప్పాలి. ఆంధ్రోళ్లు.. మీకు హోదా కావాలంటే తెలంగాణ ఉద్య‌మాన్ని ఒక్క‌సారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు లేక‌పోతే పాత పేప‌ర్ల‌ను తిర‌గేయండి.ఉద్య‌మం అంటే ఏమిటో.. ఆకాంక్ష‌ల్ని పోరాడి సాధించుకోవ‌టం ఎలానో తెలుస్తుంది.