Begin typing your search above and press return to search.

బీజేపీ కొంప‌ముంచిన నోటా...సీఎం సీటు గాయ‌బ్‌

By:  Tupaki Desk   |   13 Dec 2018 5:45 PM GMT
బీజేపీ కొంప‌ముంచిన నోటా...సీఎం సీటు గాయ‌బ్‌
X
భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎదురవుతున్న వ‌రుస షాకుల ప‌రంపర‌లో ఇది పీక్ అనుకోవ‌చ్చు. ఐదు రాష్ట్రాల‌ ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలిన సంగతి తెలుసు కదా. అందులో మూడు అధికారంలో ఉన్న రాష్ర్టాలను కాంగ్రెస్ చేతికి అప్పగించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ కూడా అందులో ఒకటి. అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయేందుకు సంచ‌ల‌న కార‌ణం తెర‌మీద‌కు వ‌చ్చింది.

మధ్యప్రదేశ్ కోసం బీజేపీ - కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. చివరికి హస్తానికే చిక్కింది. అయితే తాజాగా బయటపడిన ఓట్ల లెక్కలు చూస్తే నోటానే బీజేపీ కొంప ముంచినట్లు స్పష్టమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీకే 0.1 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ 109 సీట్లతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్ మాత్రం బీఎస్పీ - ఎస్పీ - ఇతర ఇండిపెండెంట్ల సాయంతో 116 మ్యాజిక్ ఫిగర్‌ ను అందుకుంది. బీజేపీపై కాంగ్రెస్ గెలిచిన కనీసం 11 స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థి ఆధిక్యం కంటే నోటాకు పడిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.

బయోరా - దామో - గున్నోర్ - గ్వాలియర్ - జబల్‌ పూర్ - జోబాత్ - మంధాట - నేపానగర్ - రాజ్‌ నగర్ - రాయ్‌ పూర్ - సువర్సాలలో నోటాకు భారీగా ఓట్లు రావడం విశేషం. ఈ 11 స్థానాల్లో మెజార్టీ వెయ్యి ఓట్ల కంటే తక్కువగా ఉంది. ఇంత తక్కువ మెజార్టీలతో ఓడిపోవడంపై తాజా మాజీ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. 2008లో 38 శాతం ఓట్లే వచ్చినా 143 స్థానాల్లో గెలిచామని - ఈసారి 40 శాతానికిపైగా వచ్చినా 109 సీట్లకే పరిమితమయ్యామని ఆయన అన్నారు. ఇక నోటా కాకుండా మాయావతి - అగ్రవర్ణాల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహం కూడా ఆ పార్టీ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఎస్సీ - ఎస్టీ వేధింపుల చట్టం విషయంలో బీజేపీ - కాంగ్రెస్‌ ల తీరుపై గుర్రుగా ఉన్న అగ్ర కులాల అధిపతులు కొన్ని చోట్ల నోటాకే ఓటు వేయండని పిలుపునిచ్చారు.