Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్‌: పొన్నురులో ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా విజ‌యం అయ‌న‌దే!

By:  Tupaki Desk   |   18 March 2019 8:21 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్‌: పొన్నురులో ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా విజ‌యం అయ‌న‌దే!
X
ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక నేత ఎన్నిసార్లుగెలిచే వీలుంది. రెండుసార్లు.. మూడుసార్లు.. నాలుగు సార్లు.. అన్నంత‌నే.. హ‌మ్మో.. అన్నిసార్లా? ఒకరే అన్నేసిసార్లు గెల‌వ‌టం సాధ్య‌మేనా? అన్న క్వ‌శ్చ‌న్ రావొచ్చు కానీ.. ఇది నిజం. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ ప‌వ‌ర్లో ఉందా? ప్ర‌తిప‌క్షంలో ఉందా? అన్న డౌట్ అక్క‌ర్లేదు. త‌న గెలుపు మాత్రం ప‌క్కా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం గుంటూరు జిల్లా పొన్నురు నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు అల‌వాటు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌నే కాదు.. ఆయ‌న తండ్రి ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి కూడా విజ‌య‌ప‌రంప‌ర‌నే సాగించారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపే త‌ప్పించి ఓట‌మి అన్న‌ది లేకుండా పార్టీని గెలిపించే క్రెడిట్ పొన్నూరుకు సొంతం. మారిన స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ప‌వ‌ర్ తో సంబంధం లేకుండా ఒకే పార్టీలో కొన‌సాగ‌టం అంత తేలికైన విష‌యం కాదు. ప‌వ‌ర్లో ఉన్న వేళ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కున్నా పార్టీలోనే కొన‌సాగే న‌రేంద్ర మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు.

గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం చిత్ర‌మైన‌దిగా చెప్పాలి. టీడీపీ పెట్టిన నాటి నుంచి ఆ పార్టీని అక్క‌డి ప్ర‌జ‌లు వ‌రుస పెట్టి ఆద‌రిస్తూనే ఉన్నారు. టీడీపీ స్టార్ట్ అయిన నాడు ధూళిపాళ్ల కుటుంబ‌మే పార్టీకి అండ‌గా మారింది. ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి 1983.. 1985.. 1989 వ‌రుస‌గా మూడుసార్లు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. ఆయ‌నకు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది.

ఇదిలా ఉంటే వీర‌య్య చౌద‌రి రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌టంతో ఆయ‌న స్థానంలో ఆయ‌న కుమారుడు రాజ‌కీయ అరంగ్రేటం చేశారు. 1994లో వీర‌య్య చౌద‌రి రాజ‌కీయ వార‌సుడిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న విజ‌యంసాధించారు. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి ఇప్ప‌టివ‌ర‌కూ విజ‌యం సాధిస్తూనే ఉన్నారు.

ఈ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించినంత వ‌ర‌కూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ధూళిపాళ్ల న‌రేంద్ర మీద పోటీ చేసిన ఏ ప్ర‌త్య‌ర్థి కూడా రెండోసారి పోటీ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌దు. ప్ర‌తి ఎన్నిక‌లోనూ న‌రేంద్ర కొత్త ప్ర‌త్య‌ర్థితోనే త‌ల‌ప‌డుతుంటారు. ఈ ఆన‌వాయితీని కొన‌సాగిస్తూ..తాజాగా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లోనూ కొత్త అభ్య‌ర్థితోనే ఆయ‌న త‌ల‌ప‌డనున్నారు.

రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన న‌రేంద్ర 1994లో కాంగ్రెస్ అభ్య‌ర్థి త‌ల‌శిల వెంక‌ట రామ‌య్యతో త‌ల‌ప‌డ‌గా.. 1999లో చిట్టినేని ప్ర‌తాప్ బాబుపై పోటీ ప‌డ్డారు. ఆ ఎన్నిక‌ల్లోనూ గెలిచిన ఆయ‌న‌.. 2004లో రాష్ట్రం మొత్తం టీడీపీ వ్య‌తిరేక ప‌వ‌నాల్లోనూ మున్న‌వ రాజ‌కిషోర్ పై పోటీ చేసి విజ‌యం సాధించారు. 2009లో రాష్ట్రంలో టీడీపీ ఓట‌మి పాలైనా న‌రేంద్ర మాత్రం ఆ ఎన్నిక‌ల్లోనూ మారుపూడి లీలాధ‌ర‌రావును ఓడించారు.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌పై విజ‌యం సాధించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కిలారి వెంక‌ట రోశ‌య్య‌పై బ‌రిలోకి దిగ‌నున్నారు. ఓవైపు బాబు ప్ర‌భుత్వంపైన విప‌రీతమైన అసంతృప్తి.. వ్య‌తిరేక‌త ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. ధూళిపాళ్ల న‌రేంద్ర త‌న మేజిక్ ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శిస్తారో లేదో చూడాలి.