Begin typing your search above and press return to search.

అమెరికాలో వెలుగు‘దివ్య’

By:  Tupaki Desk   |   15 Jun 2018 4:20 AM GMT
అమెరికాలో వెలుగు‘దివ్య’
X
ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదగాలంటే చాలా కష్టం. ఎంతోమంది మహిళలను ఎదగనీయకుండా తొక్కేస్తూనే ఉంటారు. కానీ ప్రతిభ ఉంటే ఏదీ అడ్డంకి కాదని నిరూపించింది దివ్యా సూర్యదేవర (39). ఈ ప్రవాస భారతీయురాలు వాహన రంగంలోనే అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటార్స్ కు ఏకంగా ముఖ్య ఆర్థిక అధికారి(సీఎఫ్ఓ)గా ఎంపికై యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచారు.

అగ్రరాజ్యం అమెరికాలోనే అతిపెద్ద సంస్థ జనరల్ మోటార్స్. ఈ కంపెనీలో ప్రస్తుతం దివ్య వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్) గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సీఎఫ్ఓ చక్ స్టీవెన్స్ స్థానాన్ని దివ్య భర్తీ చేసింది. సెప్టెంబర్ 1న ఆమె సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నారు..

తమిళనాడు రాజధాని చెన్నైలో లో దివ్య పుట్టింది. 2017 జూలై నుంచి జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తోంది. జనరల్ మోటార్స్ లో మహిళలకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రస్తుతం జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా కూడా మహిళే కావడం విశేషం.. మరే ఇతర వాహన సంస్థలోనూ ఇలా మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చిన దాఖలాలు లేవు. ఎస్అండ్ పీ టాప్ 500 కంపెనీల్లో సీఈవో, సీఎఫ్ఓలుగా మహిళలు పనిచేస్తున్న కంపెనీల్లో జనరల్ మోటార్స్ చేరింది.

ప్రపంచ ప్రఖ్యాత జనరల్ మోటార్స్ లో అత్యున్నత పదవి చేపట్టిన దివ్య తెలుగు అమ్మాయి కావడం విశేషంగా చెప్పవచ్చు. పదమూడేళ్లుగా ఆ సంస్థలో ఆమె విధులు నిర్వహిస్తోంది. దివ్య అమ్మా నాన్న ది తెలుగు రాష్ట్రమే. ఎప్పుడో చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. చదువంటే దివ్యకు పంచప్రాణాలు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో తల్లి ఆమెను పెంచి పెద్దచేసింది. ఒంటరిగా తల్లిపడుతున్న కష్టాలు చూసి దివ్య కష్టపడి చదివింది. మద్రాసు యూనివర్సిటీలో కామర్స్ లో మాస్టర్ చేశాక.. ఇరవై రెండేళ్ల వయసులో దివ్య అమెరికా వెళ్లారు. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఏంబీఏ చేశారు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు యూబీఎస్ లో విధులు నిర్వర్తించారు. అనంతరం వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ లో ఉద్యోగం లభించింది. ఇరవై ఐదేళ్లకే పెద్ద కంపెనీలో జాబ్ కొట్టిన దివ్య కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు.సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో కీలకఉండి 2016లో ఆటోమోటివ్ రైజింగ్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. నలబై మంది విజేతల్లో మొదటి స్థానంలో నిలిచారు. అనంతరం సంస్థ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పుడు 2017లో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా , సీఎఫ్ ఓ గా ఎదిగారు.