దినకరన్ చుట్టూ తమిళనాడు రాజకీయం

Sun Aug 27 2017 15:41:11 GMT+0530 (IST)

తమిళనాడు రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు  ఏపీఎస్ ఓపీఎస్‌ల చుట్టూ తిరిగిన రాజకీయం ఒక్కసారిగా ఇప్పుడు దినకరన్ సెంట్రిక్‌గా మారిపోయింది. దీంతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. దినకరన్ శిబిరంలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడంతో బలం 21కి పెరిగింది. తటస్త వైఖరి అవలంభిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్ వైపే మొగ్గు చూపుతున్నారు. 8మంది మంత్రులు 60 మంది ఎమ్మెల్యేలు తమకు అండగా ఉన్నారని మరో రెండు రోజుల్లో తమకు మద్దతు ప్రకటించనున్నారని   దివాకరన్   ప్రకటించారు.ఈ పరిణామాలతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది. ఏపీఎస్ - ఓపీఎస్ వర్గాలు చేతులు కలిపితేచాలు.. రాష్ట్రంలో పాలన గాడిన పడుతుందని భావించిన ప్రతి ఒక్కరూ ఈ పరిణామంతో నివ్వెరపోతున్నారు.  మరోపక్క అసెంబ్లీలో బలాబలాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో అన్నాడీఎంకేకి 134మంది ఎమ్మెల్యేలున్నారు. దినకరన్ వైపు 21 మంది నిలవడం వల్ల ఎడపాడి బలం 122 నుంచి 113కి పడిపోయింది. బలపరీక్ష నుంచి గట్టెక్కాలంటే మరో నలుగురు అవసరం.

ఇక ఏపీఎస్ ప్రభుత్వంపై నమ్మకంలేదన్న 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయినా కూడా వారి నుంచి ఎలాంటి స్పందనాలేదు. ఈ క్రమంలో వారిపై అనర్హత వేటు వేస్తే అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 134 నుంచి 115కు పడిపోతుంది.  మరోపక్క ఈ గొడవను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చూస్తున్న డీఎంకేకి మిత్రపక్షాలను కలుపుకుని 98 మంది ఉన్నారు. అయితే  మ్యాజిక్ ఫిగర్ 117 లేకున్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా  ఏపీఎస్ ప్రభుత్వం గట్టెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కానీ దినకరన్ వ్యవహారశైలి మాత్రం మరోరకంగా ఉంది. తనను ఎవరూ బెదిరించలేరని ఆయన చెబుతున్నారు. గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే పార్టీలో ఆపరేషన్ మొదలైంది వేచి చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో అని ధీమా వ్యక్తం చేశారు. పోనీఈ పరిణామం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న ఏపీఎస్ ఆలోచనను కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితిలో డీఎంకే లబ్ధిపొందే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి తమిళనాడు రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ వైకుంఠ పాళిని తలపిస్తోంది.