Begin typing your search above and press return to search.

కేసీఆర్ బిజినెస్ ఐడియాను ఆయ‌న ప‌సిగ‌ట్టాడా?

By:  Tupaki Desk   |   24 May 2017 4:08 AM GMT
కేసీఆర్ బిజినెస్ ఐడియాను ఆయ‌న ప‌సిగ‌ట్టాడా?
X
తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు వివాదంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. అలాంటి వివాదాల్లో ఒక‌టి ధ‌ర్నాచౌక్ త‌ర‌లింపు. న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న ఇందిరాపార్కు స‌మీపంలోని ధ‌ర్నాచౌక్‌ను న‌గ‌ర‌శివారుకు త‌ర‌లించాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చాలా బ‌లంగా ఉన్నారు. అదే స‌మ‌యంలో.. ధ‌ర్నా చౌక్‌ను న‌గ‌ర శివారుకు త‌ర‌లించే విష‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి తెలంగాణ విప‌క్షాలు.

ధ‌ర్నా చౌక్ విష‌యంలో ప్ర‌భుత్వ వైఖ‌రిని త‌ప్పు ప‌డుతూ.. ఈ మ‌ధ్య‌నే విప‌క్షాలు భారీ ఆందోళ‌న‌ను చేపట్టం తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసిన ఈ ఆందోళ‌న‌.. టీఆర్ఎస్ స‌ర్కారు తీరును వేలెత్తి చూపేలా చేసింద‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ధ‌ర్నా చౌక్ త‌ర‌లింపు ఇష్యూకు సంబంధించి స‌రికొత్త కోణాన్ని తెర మీద‌కు తీసుకొచ్చారు తెలంగాణ జేఏసీ ఛైర్మ‌న్ కోదండం మాష్టారు. ధ‌ర్నాచౌక్ త‌ర‌లింపు వెనుక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార ప్ర‌యోజ‌నాలు ఉండ వ‌చ్చ‌న్న అనుమానం క‌లుగుతుందన్నారు.

ధ‌ర్నాచౌక్ త‌ర‌లింపు విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కూ విన‌ప‌డ‌ని కొత్త కోణం తాజాగా బ‌య‌ట‌కు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేసిన కోదండ‌రాం.. త‌న అనుమానాల‌కు బ‌లం చేకూరే వాద‌న‌లు వినిపించారు. ధ‌ర్నా చౌక్ చుట్టూ ఉన్న స్థానిక బ‌స్తీల్ని ఎత్తి వేసి.. హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌రాల‌ను వ్యాపార కేంద్రంగా మార్చాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా త‌మ‌కు స‌మాచారం ఉంద‌న్నారు.

ధ‌ర్నా చౌక్‌.. స‌చివాల‌యం త‌ర‌లింపు ద్వారా ప్ర‌జ‌ల స‌మిష్టి ఆస్తుల్ని ఒక‌రిద్ద‌రు వ్యాపారుల‌కు తాక‌ట్టు పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా ఆయ‌న ఆరోపించారు. ప‌రేడ్ గ్రౌండ్‌లో స‌చివాల‌యాన్ని నిర్మించాల‌న్న అంశంపై అక్క‌డి వాక‌ర్స్ అసోసియేష‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌టాన్ని కోదండం మాష్టారు ప్ర‌స్తావించారు.

ఇదిలా ఉంటే.. ధ‌ర్నా చౌక్ ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ తాజాగా త‌న కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింది. ఇందిరాపార్కు స‌మీపంలోని ఎల్ఐసీ కాల‌నీలో పాద‌యాత్ర‌ను నిర్వ‌హించి.. ధ‌ర్నా చౌక్ పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని చెప్పుకొచ్చారు. ధ‌ర్నా చౌక్ ను త‌ర‌లించాల‌న్న అంశాన్ని బ‌లంగా స‌మ‌ర్థిస్తున్న కాల‌నీల్లో ఉద్య‌మ‌కారుల పాద‌యాత్ర‌లు ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తాయో?