Begin typing your search above and press return to search.

మీడియా అధినేతను కేంద్రమంత్రి కలవటమంటే?

By:  Tupaki Desk   |   21 Sep 2019 10:35 AM GMT
మీడియా అధినేతను కేంద్రమంత్రి కలవటమంటే?
X
ఆసక్తికర అంశం వార్తాంశంగా బయటకు వచ్చింది. తెలుగు మీడియాలో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు అవకాశం ఇచ్చింది. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబుకు అనుకూల మీడియాగా పేరున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కేను కేంద్రమంత్రి కలవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ మధ్య వరకూ మోడీ మీద నెగిటివ్ కథనాలు సిరీస్ లెక్కను అచ్చేయటం.. దానిపై బీజేపీ యువ మోర్చా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

అంతేనా.. ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేసింది. అలాంటి బీజేపీ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి దగ్గరైందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బాబు అండ్ కోకు సన్నిహితంగా మెలగటం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యవహరంచటంతో గులాబీ బాస్ చాలా గుస్సాలో ఉన్న విషయం తెలిసిందే.

తెలంగాణ.. ఏపీలో జరిగిన రెండు ఎన్నికల్లో ఆర్కే మీడియా మద్దతుగా నిలిచిన పార్టీలు పరాజయం పాలుకావటంతో పలు సందేహాలతో పాటు.. ఆర్కే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంట నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సంస్థలు బీజేపీకి దగ్గర కావటంతో కొత్త సమీకరణాలకు తెర తీసినట్లైందని చెప్పక తప్పదు.

గడిచిన కొద్దికాలంగా బీజేపీ నేతలకు ఆర్కే మీడియా సంస్థలో ప్రయారిటీ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఆయన ఇంటికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెళ్లటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370 నిర్వీర్యంపై పలువురు ప్రముఖుల వద్దకు వెళ్లి.. తాము ఎందుకీ నిర్ణయాన్ని తీసుకున్న విషయాన్ని వివరించి.. వారి మద్దతును తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆర్కే ఇంటికి వెళ్లారని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని మీడియా సంస్థలు ఉండగా.. ఆర్కే ఇంటికి కేంద్రమంత్రి స్వయంగా వెళ్లటం అంత చిన్న విషయం కాదంటున్నారు. ఆర్కే ఇంటికి వెళ్లిన సమయంలో కేంద్రమంత్రితో పాటు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. ఎమ్మెల్సీ రాంచందర్రావు.. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. మొత్తానికి తాను మద్దతుగా నిలిచిన రాజకీయ పార్టీలు పరాజయం పాలైన వేళ.. బీజేపీ దన్ను దొరకటం ఆర్కేకు కాస్తంత ఉపశమనం లభించినట్లుగా చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో చూడాలి.