అక్కడ టీడీపీలో అసమ్మతి సెగలు!

Thu Mar 14 2019 11:06:11 GMT+0530 (IST)

ధర్మవరం టీడీపీలో అసమ్మతి సెగలు తారస్థాయికి చేరాయి. ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ చౌదరి (వరదాపురం సూరీ)పై టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యే సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు సూరీ ఆడియో టేపులు విడుదల చేసి ఆయన బండారాన్ని బట్టబయలు చేశారు. గోనుగుంట్ల సూర్యనారాయణ చౌదరి అలియాస్ వరదాపురం సూరి.. ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 2014లో గెలిచారు.అయితే గెలిచిన నాటి నుంచి నిత్యం దందాలు - వసూళ్లు - హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు చేస్తూ సొంత పార్టీ నుంచి నాయకుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈమేరకు ఓ ఆడియో ఫైల్ విడుదల చేసిన టీడీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరదాపురం సూరి అరాచకాలను భరించలేక బయటికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో తనను గెలిపించి.. ప్రత్యర్థులను ఆరు నెలల్లో మట్టుబెట్టాలని తన కార్యకర్తలను వరదాపురం ఇచ్చిన సూచనలు - సలహాలు కలకలం రేపాయి.

‘నన్ను గెలిపించండి.. ఎలక్షన్ల తర్వాత ఆరు నెలలపాటు ప్రత్యర్థులను వేటాడే పనిలో ఉందాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. చంపుతారా? కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా మీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఐదేళ్లు శాంతియుతంగా ఉండాలనుకున్నాం. శాంతియుతంగా ఉంటే కొందరు బడాయి పడుతున్నారు. ఆ బడాయిగాళ్లందరినీ కాళ్లు చేతులూ ఇరచాల్సిందే.. తప్పదు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పని మొదలుపెట్టండి. ప్రత్యర్థులను అంతమొందిస్తే తప్ప మనకు మనుగడ ఉండదు. మే 16 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు టైం ఇస్తాం’ అని ధర్మవరం ఎమ్మె ల్యే వరదాపురం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు ప్రోద్బలంతోనే వరదాపురం హత్యా రాజకీయాలకు తెర దీస్తున్నారని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు.

ధర్మవరం నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న టీడీపీ నేతలు మాజీ ఎంపీపీ - వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిలేటి - కౌన్సిలర్ రాయపాటి రామకృష్ణ - గంటాపురం జగ్గు - బోయపాటి ప్రదీప్ - నాగశేషయ్య ఎమ్మెల్యే ఆగడాలను భరించలేక బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపులను మీడియాకు విడుదల చేశారు. నియోజకవర్గంలో తన కోటరీని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు.

రైల్వేస్టేషన్ లో టీ అమ్ముకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద టెండర్ల వరకు ఆయనకు కమీషన్లు ముట్టజెప్పందే పనులు దక్కవు. ఎవరైనా పనులు దక్కించుకుంటే తన అనుచరులతో వారిపై దాడులు చేయించి బలవంతపు వసూళ్లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు అని టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఆయన అరాచకాలు - వేధింపుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరక్కపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో వరదాపురం అరాచకాల వెనుక చంద్రబాబు హస్తం ఉండి ఉంటుందని ప్రజల నోట నానుతోంది.