Begin typing your search above and press return to search.

మరో ప్రచారం; అమ్మవారు నైవేద్యం తిన్నారట

By:  Tupaki Desk   |   5 Sep 2015 4:56 AM GMT
మరో ప్రచారం; అమ్మవారు నైవేద్యం తిన్నారట
X
అప్పుడెప్పుడో గణేషుడి విగ్రహాలు పాలు తాగాయని.. కొద్దికాలం గడిచిన తర్వాత షిర్డీ సాయి విగ్రహం ముందు నుంచి విబూది రాలుతుందన్న ప్రచారాలు.. భక్తజనం పోటెత్తటం తెలిసిందే. ఇవన్నీ నిజాలు కావని కొందరంటే.. మా కళ్లతో మేం చూస్తే కూడా మీరు కాదంటారా? అన్న దబాయింపులు జరిగిపోయాయి. విగ్రహాలు పాలు తాగవని.. కాకుంటే.. పాలను లాగే శక్తి ఉంటుందంటూ అప్పట్లో కొందరు శాస్త్రీయంగా నిరూపించటం గట్రా జరిగిపోయాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ వార్త క్షణాల్లో వ్యాపించటమే కాదు.. అర్థరాత్రివేళలో ఆలయానికి భక్తజనం పరుగులు తీసిన పరిస్థితి. రాత్రి పూజల్లో భాగంగా అమ్మవారికి నైవేద్యం పెట్టిన అర్చకులు..బయటకొచ్చి తలుపులు మూసేశారు. అనంతరం తలుపులు తెరిచి చూస్తే.. చేతిలోని స్పూనుకు.. నోటికి నైవేద్యం పెట్టిన అన్నం మెతుకులు కనిపించాయట.

ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. అంతే.. భక్తులు ఒక్కసారి అమ్మవారి ఆలయానికి పరుగులు తీసి.. బారులు తీరిన పరిస్థితి. ఈ విషయంలో వాస్తవం సంగతి ఎలా ఉన్న.. అలా జరిగిందట.. ఇలా అయ్యిందట లాంటి మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి.. ఈ నమ్మకం ఎంతగా వ్యాప్తి చెందుతుందో..?