Begin typing your search above and press return to search.

బాబూ... దేవినేని ప్లాన్ ఏంటో తెలిసిందా?

By:  Tupaki Desk   |   24 Feb 2017 9:05 AM GMT
బాబూ... దేవినేని ప్లాన్ ఏంటో తెలిసిందా?
X
సుఖాల్లోనే కాకుండా కష్టాల్లోనూ వెంట న‌డిచే వారిని ఎవ్వ‌రు కూడా మ‌రిచిపోకూడ‌దు. ఎందుకంటే... అలాంటి స్వ‌భావం ఉన్న వారి కంటే మ‌న‌కు శ్రేయోభిలాషులు ఎవ‌రూ ఉండ‌రు. అయితే ఇది సామాన్యుల‌కు స‌రిపోతుందేమో కానీ... రోజుకో లెక్క వేసే రాజ‌కీయ నేత‌ల‌కు మాత్రం స‌రిపోవ‌డం లేదు. అయితే రాజ‌కీయాల్లోనూ వెంట న‌డిచిన వారిని చివ‌రి దాకా కాపాడుకునే స్వ‌భావం ఉన్న రాజ‌కీయ నేత‌లు లేర‌ని చెప్ప‌లేం. ఎందుకంటే దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి... త‌న‌ను న‌మ్ముకున్న వారికి క‌డ‌దాకా కొండంత అండ‌గా నిలిచిన వైనం మ‌నంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఇలాంటి స్వ‌భావం ఉన్న వారు చాలా త‌క్కువ మందే క‌నిపిస్తారు. త‌క్కువ మంది అనేకంటే కూడా అలాంటి వారిని వేళ్ల‌పై లెక్క పెట్టొచ్చ‌ని చెప్ప‌డం క‌రెక్టేమో. అయినా అస‌లు విష‌యం చెప్ప‌కుండా ఈ చాంతాడంతా వివ‌ర‌ణ ఎందుకంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన దేవినేని రాజ‌శేఖ‌ర్ (దేవినేని నెహ్రూ) ఇటీవ‌ల త‌న కొడుకు - వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌ను వెంట‌బెట్టుకుని మ‌రీ టీడీపీలో చేరిన విషయం గుర్తుందిగా. కృష్ణా జిల్లా నేత‌గా కంటే కూడా విజ‌య‌వాడ న‌గ‌ర నేత‌గానే జ‌నానికి తెలిసిన దేవినేని ఇటీవ‌ల ఓ వినూత్న య‌త్నం చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వివ‌రాల్లోకెళితే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఈస్ట్ నియోజ‌కవ‌ర్గం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్‌ రావు చేతిలో ఓట‌మిపాల‌య్యారు. త‌ర్వాత మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో యువ‌జ‌న కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న త‌న కుమారుడు దేవినేని అవినాశ్ తో క‌లిసి టీడీపీలో చేరిపోయారు. పార్టీలో చేరిన నాటి నుంచి దేవినేని ఫ్యామిలీ టీడీపీలో ప‌ట్టు సాధించే దిశగా చాలా తెలివిగా పావులు క‌దుపుతోంది.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఓ 400 మంది ముఖ్య కార్య‌క‌ర్త‌ల‌ను వెంటేసుకుని బ‌య‌లుదేరిన దేవినేని... తొలుత వారంద‌రినీ చంద్ర‌బాబు వ‌ద్ద‌కు తీసుకెళ్లార‌ట‌. వారంద‌రినీ పేరుపేరునా చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం చేసిన దేవినేని... వారు త‌న‌కు ఏ విధంగా సాయ‌ప‌డ్డారో, క‌ష్ట స‌మ‌యాల్లో వారు త‌న‌ను ఎలా ఆదుకున్నారో, క‌ష్టాలు ఎదుర్కొంటూ కూడా వారు త‌న వెంట ఎలా న‌డిచార‌న్న విష‌యాల‌ను ఆయ‌న చంద్ర‌బాబుకు వివ‌రించారు. తాను చెప్పిన విష‌యాల‌న్నింటినీ ఆస‌క్తిగా ఉన్న చంద్ర‌బాబుకు దేవినేని చివ‌ర్లో మ‌రో మాట చెప్పార‌ట‌. మీ వ‌ద్ద‌కు తీసుకొచ్చిన వీరంద‌రినీ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ వ‌ద్ద‌కు కూడా తీసుకెళ‌తాన‌ని చెప్పిన ఆయ‌న‌... చంద్ర‌బాబు వ‌ద్ద అనుమ‌తి తీసుకుని ప‌క్క‌నే ఉన్న లోకేశ్ వ‌ద్ద‌కు కూడా వారిని తీసుకుని వెళ్లార‌ట‌. అక్క‌డ కూడా సేమ్ టూ సేమ్ ప‌రిచ‌యాలు - ఉపోద్ఘాతాలు అయిపోయాక‌... దేవినేని అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టార‌ట‌. తానేదో వీరంద‌రికీ ప‌ద‌వులు ఇవ్వాల‌ని కోర‌డం లేద‌ని, వీరంతా ఎక్క‌డ ప‌నికొస్తే... అక్క‌డ వారి సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని చెప్పేందుకే తీసుకొచ్చాన‌ని చెప్పార‌ట‌.

అంటే ప్ర‌స్తుతానికి కాక‌పోయినా... భ‌విష్య‌త్తుల్లో వీరంద‌రికీ వారి వారి హోదాల‌కు త‌గ్గ ప‌దవులు ఇవ్వాల్సిందేనని ప‌రోక్షంగా దేవినేని... అటు చంద్రబాబుకు ఇటు లోకేశ్ కు ప‌రోక్ష సంకేతాలిచ్చారు. నిన్న‌టిదాకా కాంగ్రెస్‌ లో ఉన్న దేవినేనికి టీడీపీలో ఉన్న కృష్ణా జిల్లా నేత‌లంతా బ‌ద్ధ శ‌త్రువులుగానే ఉన్నారు. అంద‌రితో క‌లిసి ప‌నిచేసుకుపోతాన‌ని దేవినేని చెబుతున్నా... అది ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట‌వుతుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి త‌రుణంలో దేవినేని వెంట‌బెట్టుకుని వ‌చ్చిన 400 మంది ఆయ‌న ముఖ్య కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వులు ఇస్తే... మిగిలిన వారి ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యం పార్టీ అధిష్ఠానానికి వ‌ణుకు పుట్టించే అంశమే. మ‌రి ఈ విష‌యం చంద్రబాబుకు అర్థ‌మైందో, లేదో తెలియ‌దు గాని... రేపు నాడు త‌న వ‌ర్గానికి ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోతే... దేవినేని ఇచ్చే పంచ్‌ ల‌కు మాత్రం చంద్ర‌బాబు సిద్ధంగా ఉండ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. చూద్దాం ఏం జ‌రుగుతుందో. ..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/