Begin typing your search above and press return to search.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ?

By:  Tupaki Desk   |   27 Oct 2016 10:18 AM GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ?
X
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ర్పే చ‌ల్లి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ప‌త్రిక‌ల‌కూ ఎక్కిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి వ‌చ్చే ఎన్నికల్లో మ‌ళ్లీ పోటీ చేయాల‌నుకుంటున్నారా... విభ‌జ‌న త‌రువాత రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటి అన్న‌ట్లే కామ్ గా ఉన్నారు.. కానీ, మ‌ళ్లీ ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధ‌వ‌మ‌తున్న‌ట్లు చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లో నేతల ముందు జాగ్ర‌త్త‌లు చూస్తున్న‌వారంతా ల‌గ‌డ‌పాటి రీఎంట్రీ గ్యారంటీ అంటున్నారు. తాజాగా దేవినేని నెహ్రూ ల‌గ‌డ‌పాటి టార్గెట్ గా విమ‌ర్శ‌లు చేయ‌డానికి కార‌ణం అదేన‌ని విశ్లేషిస్తున్నారు.

ఇటీవ‌లే టీడీపీలో చేరిన దేవినేని నెహ్రు మెల్లగా కృష్ణా జిల్లాలో టీడీపీపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తన సీనియారిటి ఆధారంగా నేతలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నెహ్రు… 2019లో టీడీపీని అధికారంలోకి తెస్తామన్నారు. జిల్లాల్లో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించి తన‌ సత్తా చూపిస్తానన్నారు. కేబినెట్ మంత్రులతో లోకేష్ సమావేశం అయితే తప్పేంటని ప్రశ్నించారు.

అంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా ఆ త‌రువాతే ఆయ‌న అస‌లు అజెండాను చూపించారు. గతంలో విజయవాడ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి నగరాభివృద్ధిని పట్టించుకోలేదని పరోక్షంగా లగడపాటి రాజగోపాల్‌ పై విమర్శలు చేశారు. ఎంపీ పదవిని అడ్డుపెట్టుకుని వ్యాపారంలో సదరు మాజీ ఎంపీ రూ. 50వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. ప్ర‌స్తుతం ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న లగడపాటి రాజగోపాల్‌ పై నెహ్రు ఈ సమయంలో విమర్శలు చేయడం చ‌ర్చ‌నీయంగా మారింది. విజ‌య‌వాడ‌లో పోటీకి టిక్కెట్ ఖాయం చేసుకుంటున్న దేవినేని నెహ్రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌గ‌డ‌పాటి త‌న‌కు ప్రత్యర్థి అవుతారని అంచ‌నా వేస్తున్నార‌ని... ల‌గ‌డ‌పాటి శిబిరం నుంచి ఆయ‌న‌కు అలాంటి స‌మాచారం ఉంద‌ని.. అందుకే ఆయ‌న ఇప్ప‌టి నుంచే విమ‌ర్శ‌లు మొద‌లుపెట్టార‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/