Begin typing your search above and press return to search.

టీడీపీ నేత యూట‌ర్న్‌... కాంగ్రెస్‌ లోకా...!

By:  Tupaki Desk   |   20 Aug 2019 12:21 PM GMT
టీడీపీ నేత యూట‌ర్న్‌... కాంగ్రెస్‌ లోకా...!
X
ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి దేశంలో రోజు రోజుకు దిగ‌జారిపోతోంది. ఇక ఎంతో బ‌లంగా ఉన్న తెలంగాణ‌లో ప‌రిస్థితి రోజు రోజుకు ఘోరంగా ప‌డిపోతోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన‌డం ఒక దెబ్బ అయితే... వెంట‌నే 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోవ‌డం మ‌రో పెద్ద దెబ్బ‌. ఇక లోక్‌ స‌భ ఎన్నిక‌ల్లో మూడు సీట్లు గెలుచుకుని కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇక ఇప్పుడు మ‌రి కొంద‌రు నేత‌లు బీజేపీ వైపు చూస్తుండ‌డంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీ కాంగ్రెస్‌ లోకి ఎవ్వ‌రూ వెళ్లేందుకు సాహ‌సం చేయ‌ని ప‌రిస్థితి. అయితే టీఆర్ ఎస్ లేకుంటే బీజేపీలోకే అన్న‌ట్టుగా తెలంగాణ‌లో రాజ‌కీయ నేత‌ల ప‌రిస్థితి ఉంది. అయితే అక్క‌డ ఆల్‌ మోస్ట్ క్లోజ్ అయిన టీడీపీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత చూపులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉన్నాయా ? అన్న‌దే తెలంగాణ‌లో హాట్ టాపిక్‌ గా మారింది.

తెలుగుదేశంలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన దేవేందర్ గౌడ్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న హోం మంత్రిగా- రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నో ప‌ద‌వులు చేప‌ట్టారు. టీడీపీ నేత‌లు అంద‌రూ బీజేపీలోకి వెళ్లిపోతుండ‌డంతో ఆయ‌న కూడా బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం నిన్న‌టి వ‌ర‌కు జ‌రుగుతోంది. అయితే దేవేంద‌ర్‌ ను కాంగ్రెస్ నేత‌లు త‌మ పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దేవేంద‌ర్‌ కు తెలంగాణ‌లో ఆయ‌న సొంత క‌మ్యూనిటీలో తిరుగులేని ప‌ట్టు ఉంది. రాజ‌కీయంగా కాస్త వెన‌క‌ప‌డ్డా ఆయ‌న వ‌ర్గం మాత్రం బ‌లంగానే ఉంది. ఈ క్రమంలోనే ఆయ‌న్ను పార్టీలోకి చేర్చుకుంటే ఆ ఎఫెక్ట్ రాష్ట్రం అంతటా ఉంటుంద‌ని భావిస్తోన్న టీ కాంగ్రెస్ పెద్ద‌లు రంగంలోకి దిగారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దేవేందర్ గౌడ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో దేవేందర్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానించారట విక్రమార్క.

ఈ భేటీతో దేవేంద‌ర్ బీజేపీ ఎంట్రీ కాస్త బ్రేక్ ప‌డిన‌ట్ల‌య్యింది. కాంగ్రెస్ ఆఫ‌ర్ నేప‌థ్యంలో కాస్త టైం తీసుకుని చెపుతాన‌న్నార‌ట‌. మ‌రి దేవేంద‌ర్ కాంగ్రెస్‌ లో చేరితే అది పెద్ద ట్విస్టే అవుతుంది. అదే టైంలో కాంగ్రెస్‌ కు పెద్ద బూస్ట‌ప్ అన‌డంలో సందేహం లేదు.