దేవెగౌడకు-గవర్నర్‌కు పాత పగలున్నాయా?

Wed May 16 2018 21:09:31 GMT+0530 (IST)

వాజూభాయి వాలా... దేశ రాజకీయాల్లో ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. మోదీ రాహుల్ గాంధీ ఇంకా ఎవరెవరో నేతలంతా ఉండగా ఈ ఊరూపేరూ తెలియని వాజూభాయి పేరెందుకు మార్మోగుతోంది అనుకోవద్దు. కర్ణాటక రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు మరోసారి తన మార్కు రాజకీయం రుచి చూపించి సీఎం పీఠం ఎగరేసుకుపోవడానికి సిద్ధమవుతున్న బీజేపీకి ఎంతో కీలకం కానున్న వ్యక్తి ఈ వాజూభాయి. కర్ణాటక గవర్నరు పదవిలో ఉన్నది ఆయనే.ఇదంతా వర్తమానం అయితే.. 22 ఏళ్ల కిందట 1996లో  జరిగిన ఓ ఘటన ఇప్పుడు కర్ణాటక తాజా రాజకీయాల నేపథ్యంలో ఆసక్తిగొలుపుతోంది. కాంగ్రెస్ మద్దతిచ్చి సీఎం పీఠంపై కూర్చోబెడతామన్నా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోలేకపోతున్న జేడీఎస్.. దాని అధినేత దేవెగౌడ అప్పట్లో ప్రధాని. ఈ వాజూభాయి గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. అప్పుడేమైందో తెలుసా... గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అప్పటి ప్రధాని దేవెగౌడ సూచనతో అప్పటి రాష్ట్రపతి రద్దు చేశారు. శంకర్ సింగ్ వాఘేలా బీజేపీని చీల్చి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అప్పుడు బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడిగా వాజూభాయే ఉన్నారు.

అప్పుడు దేవెగౌడ రాజకీయంతో వాజూభాయి కళ్లెదుటే ఆయన పార్టీ అధికారాన్ని పోగొట్టుకోగా.. ఇప్పుడు పరిస్థితులు రివర్సయ్యాయి. వాజూభాయి చేయబోయే రాజకీయం కీలకం కానుంది. నిర్ణయాత్మక పాత్రలో వాజూభాయి ఉండగా తన కుమారుడికి అందివచ్చినట్లే వచ్చిన సీఎం సీటు వస్తుందో లేదో తెలియని పరిస్థితి దేవెగౌడది.  సీవోటర్ ఎండీ యశ్వంత్ దేశ్‌ముఖ్ తాజాగా దీనిపై ట్వీట్ చేయడంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేవెగౌడ కర్మఫలితం అనుభవించబోతున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.