Begin typing your search above and press return to search.

ప్రభుత్వం కూల్చివేత.. దేవెగౌడ చెప్పిన నిజం

By:  Tupaki Desk   |   23 Aug 2019 9:35 AM GMT
ప్రభుత్వం కూల్చివేత.. దేవెగౌడ చెప్పిన నిజం
X
తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుంది కర్ణాటక వృద్ధ రాజకీయ పిండం దేవెగౌడ పరిస్థితి. చేయాల్సిన టైంలో చేయకుండా ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తది.. ఇలానే ఏడ్వాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పొత్తుల సంసారంతో నడుస్తున్న వేళ.. అసమ్మతిని కంట్రోల్ చేయాల్సిన పెద్దమనిషి జేడీఎస్ అధినేత దేవెగౌడ పంతాలకు పోయారు. కాంగ్రెసోళ్లు కోరిన నాలుగు మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాస్త దువ్వితే పోయేది.. కానీ సిద్ధరామయ్యతోనే ఢీ అంటే ఢీ అన్నాడు. ఆయన పుల్లలు పెట్టి దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ప్రభుత్వాన్ని పరోక్షంగా కూల్చేశారన్న విమర్శలు వచ్చాయి.

ఇలా దేవెగౌడ ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది. సిద్ధరామయ్య ఒకప్పుడు దేవెగౌడ అనుంగ అనుచరుడు. ఈయన దగ్గరే ఓనమాలు నేర్చుకొని కాంగ్రెస్ లో చేరి ఏకంగా సీఎం అయ్యారు. అయితే శిష్యుడిపై పంతం పట్టి కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు దేవెగౌడ.. సామరస్యంగా ఉంటే ఇప్పుడు కన్నడలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి ఉండేది కాదంటారు..

ఇక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవెగౌడ మరోసారి సిద్ధరామయ్యను కడిగేశారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని దేవెగౌడ తాజాగా ఆరోపించారు. తన కుమారుడు కుమారస్వామి సీఎంగా ఉండడం సిద్దరామయ్యకు ఇష్టం లేదని.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని కూల్చాడని మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సిద్ధరామయ్య మద్దతుదారులేనని ఆరోపించారు. సిద్ధరామయ్య వైఖరిని కాంగ్రెస్ అధిష్టానం గమనించాలన్నారు. తన చేతిలో గతంలో చాముండేశ్వరి నియోజకవర్గంలో ఓడిన సిద్ధరామయ్య పాత పగలతోనే తనపై కక్ష గట్టి తన కుమారుడి ప్రభుత్వాన్ని కూల్చాడని ఆరోపించారు. తనను గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాడని మండిపడ్డారు.