కేసీఆర్ కొత్త కల స్కెచ్ బయటకొచ్చింది

Thu Sep 07 2017 11:19:19 GMT+0530 (IST)

తాను కన్న కలను తీర్చుకునేందుకుతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా ప్రయత్నిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడున్న సచివాలయం.. అసెంబ్లీ స్థానే.. సరికొత్త కట్టడాల్ని కట్టాలన్న కేసీఆర్ కల. ఇందుకోసం గడిచిన కొన్నాళ్లుగా ఆయన ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు.మొత్తంగా ఆయన ప్రయత్నాలు ఫలించాయి. కేసీఆర్ కోరుకున్న రీతిలో సికింద్రాబాద్ లోని బైసన్ పోలో.. జింఖానా మైదానాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేందుకు అధికారికంగా నిర్ణయం తీసుకుంది.దీంతో.. బైసన్ పోలో మైదానంలో సచివాలయం.. అసెంబ్లీ భవనాలతో పాటు.. విభాగ అధిపతుల నివాసాల్ని నిర్మించాలన్న కలను కేసీఆర్ సాకారం చేసుకున్నారని చెప్పాలి.

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. కేంద్రం ఓకే అన్నదో లేదో రెండు..మూడు రోజుల వ్యవధిలోనే బైసన్ పోలో గ్రౌండ్ లో నిర్మించే తెలంగాణ రాష్ట్ర సచివాలయం నమూనాను తెర మీదకు తీసుకొచ్చేశారు. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సరికొత్త తెలంగాణ సచివాలయం స్కెచ్‌ను బయటపెట్టారు. చూసినంతనే రాజసం ఉట్టిపడేలా.. గ్రాండ్ గా కనిపిస్తున్న ఈ నమూనాను.. వాస్తవ రూపం దాలిస్తే.. హైదరాబాద్ మహానగరానికి ఈ భవనం మరో మణిపూసలా మారుతుందనటంలో సందేహం లేదు.

అమెరికాలోని షికాగోలో ఉన్న ఫెడరల్ భవనం తరహాలో నిర్మిస్తున్న ఈ భారీ భవనం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలో ఉన్న షికాగో ఫెడరల్ భవన నమూనాలో తెలంగాణ సచివాలయం ఉండనుంది. రాజప్రసాదం మాదిరి హంగులున్న దీని నమూనా చూస్తే.. కేసీఆర్ టేస్ట్ ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుందంటున్నారు.

నవంబరులో హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరు కానున్న ప్రధాని మోడీ చేతుల మీదుగా సరికొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయిస్తారని చెబుతున్నారు. 2020 నాటికి కొత్త సచివాలయంలో పాలన షురూ చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. రెండేళ్ల వ్యవధిలో ఈ భారీ భవనాన్ని నిర్మించటం ద్వారా తన సత్తా ఏమిటో చాటాలని సీఎం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి సచివాలయంలో వాస్తు లోపం ఉందన్న భావనతో గడిచిన 11 నెలలుగా సచివాలయం వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శ ఉంది. తాను సచివాలయానికి రాకపోవటానికి కారణం ఏమిటన్న దానిపై కేసీఆర్ సమాధానం చెప్పింది లేదు. ఆ మాటకు వస్తే.. ఆయన్ను అడిగే ధైర్యం ప్రముఖ మీడియాకు సంబంధించిన పాత్రికేయులు  చేయలేదని చెప్పాలి. కేసీఆర్ ను నేరుగా అడగకున్నా.. ఇదేం పద్ధతని ప్రశ్నించేలా వార్తలు రాసిందేమీ లేకపోవటం గమనార్హం.

తన కలల సచివాలయాన్ని తయారు చేసుకున్న తర్వాత కేసీఆర్ ప్రతిరోజూ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ కు చెందిన ముఖ్యనేతలు చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో కూడా ఇప్పుడున్న సచివాలయానికి  రారన్న మాటను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.

ముంబయికి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ కు డిజైన్లను సిద్ధం చేసే బాధ్యతను అప్పగించారు. పాత సచివాలయ నిర్మాణానికి ఆయన ప్రతిపాదనలు ఇవ్వగా.. ఆ డిజైన్ లో కొన్ని మార్పులు చేసి తాజాగా విడుదల చేసిన డిజైన్‌ను ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.

కేసీఆర్ ఓకే చెప్పిన నమూనాకు మూలమైన షికాగోలోని ఫెడరల్ భవన చరిత్రను చూస్తే.. 1898లో నిర్మాణం స్టార్ట్ చేసిన ఈ కట్టడం 1905లో పూర్తి చేశారు. మధ్యలో దాడుల నేపథ్యంలో ఈ భవనం ధ్వంసమైంది. అనంతరం 1965లో మళ్లీ దీన్నిపాత నమూనాలో నిర్మించారు. ఇప్పుడు అదే నమూనాను కేసీఆర్ ఓకే చెప్పటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. అక్టోబరు నాటికి కేంద్రం భూమిని అప్పగిస్తుందని.. నవంబరులో శంకుస్థాపన అనంతరం వేగంగా పనులు జరుగుతాయని చెబుతున్నారు. పూర్తిగా వాస్తును ప్రాతిపదికగా తీసుకొని ఈ సచివాలయాన్ని నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే ఆరేడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ సచివాలయంలో మూడు లక్షల చదరపు అడుగులను సచివాలయంలోని 32 శాఖలకు.. మిగిలిన 4 లక్షల చదరపు అడుగులను విభాగాధిపతులు.. కమిషనరేట్.. డైరెక్టరేట్ కార్యాలయాలకు అప్పగించనున్నారు. కొన్ని కార్యాలయాల్ని మాత్రం సచివాలయానికి దూరంగా ఉంచనున్నారు. విశాలమైన స్థలంలో నిర్మించే సచివాలయంలో నిర్మాణాలు తక్కువగా.. పచ్చదనానికి పెద్దపీట వేసేలా నిర్మాణం సాగనుందని చెబుతున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ పరేడ్ గ్రౌండ్ గా ఉంచుతారని.. పార్కింగ్ కు పెద్ద ఎత్తున స్థలాన్ని కేటాయించనున్నారు.