నంద్యాల కేంద్ర బలగాల పరిధిలోకి వెళ్లిందే!

Sun Aug 13 2017 13:34:35 GMT+0530 (IST)

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 23న జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్ అంతకంతకూ సమీపిస్తోంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న అధికార టీడీపీ - విపక్ష వైసీపీ... హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందుగానే రెండు పర్యాయాలు నంద్యాలలో పర్యటించిన వచ్చిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అక్కడ అభివృద్ధి పనులకు ఒక్కసారిగా గేట్లు ఎత్తేసి వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడం కొత్తగా ఎలాంటి తాయిలాలను ప్రకటించేందుకు అవకాశం లేకపోవడంతో మరోమారు అక్కడికి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం.మరోవైపు చంద్రబాబు కంటే కాస్తంత ఆలస్యంగా నంద్యాలలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నంద్యాల బైపోల్స్ హీట్‌ను అమాంతంగా పెంచేశారు. తొలుత బహిరంగ సభ ఆ తర్వాత గడచిన మూడు రోజులుగా నాన్ స్టాప్ రోడ్ షోలతో జగన్... టీడీపీని వెనక్కు నెట్టేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు రోజుల పర్యటనతోనే జగన్... తన పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి విజయావకాశాలను మెరుగుపరిచారని కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అటు టీడీపీ కూడా తన వంతుగా మంత్రులను దించేసి హోరాహోరీ ప్రచారానికి తెర తీసింది. ఈ నేపథ్యంలో అసలు నంద్యాలలో నిష్పక్షపాతంగా పోలింగ్ జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తిన పరిస్థితి. ఓ వైపు అధికార పార్టీ టీడీపీ - మరోవైపు జనంలో మెరుగైన జనాదరణ ఉన్న వైఎస్ జగన్... మరి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా?... అంటే డౌటేనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి.

ఇదే కోణంలో యోచించిన ఎన్నికల సంఘం ఈ అనుమానాలకు విరుగుడు కనిపెట్టేసింది. రెండు పార్టీల హోరాహోరీ ప్రచారం అధికార పార్టీ తాయిలాలు స్థానిక అధికారులను తన వైపు తిప్పుకొనే ప్రమాదం ఉందన్న భావనతో అసలు అక్కడి భద్రత పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా... కేంద్ర బలగాలకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చేసిందట. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికలపై కాసేపటి క్రితం సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్... నంద్యాలలో కేంద్ర బలగాలను మోహరించనున్నట్లు ప్రకటించారు. నంద్యాల అసెంబ్లీ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కూడా కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటాయని ఆయన ప్రకటించారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయంటే ఇక స్థానిక అధికారులు అధికార పార్టీ ఆటలు ఎంతమాత్రం చెల్లనేరవు. ఈ క్రమంలో నంద్యాల ప్రజలు తమ ఇష్టపూర్వకంగా ఎవరికి ఓటేయాలనుకుంటే... వారికే వేసే అవకాశాలు మరింత మెరుగయ్యాయనే చెప్పాలి. వెరసి ఇక నంద్యాల బైపోల్స్‌లో అధికార దుర్వినియోగం ఇక చెల్లదన్న మాట.