Begin typing your search above and press return to search.

బాబు.. జగన్ చేయని పని వాళ్లు చేశారు

By:  Tupaki Desk   |   28 July 2016 4:38 PM GMT
బాబు.. జగన్ చేయని పని వాళ్లు చేశారు
X
ఏపీ ప్రజలకు పెద్ద సాంత్వన కలిగిన రోజుగా చెప్పాలి. మిత్రధర్మం పేరుతో ఏపీ అధికారపక్షం మౌనంగా ఉంటే.. కేంద్రంతో లెక్క తేడా వస్తే మొత్తంగా దెబ్బ పడుతుందన్న ముందస్తు జాగ్రత్తతో ఏపీ విపక్షం ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ.. ధర్మంగా.. న్యాయంగా ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా మీద ఏపీ నేతలెవ్వరూ మాట్లాడకున్నా.. పలు పార్టీల నేతలు గళం విప్పారు. విభజన సమయంలో తమకు అన్యాయం జరిగిందని.. తమ తరఫు ఎవరూ మాట్లాడలేదని ఆవేదన చెందిన సీమాంధ్రులకు తాజాగా చోటు చేసుకున్న పరిణామం పెద్ద ఊరటగా చెప్పాలి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు.. ఇంకాస్పష్టంగా చెప్పాలంటే ఏపీతో ఏ మాత్రం సంబంధం లేని వారు గళం విప్పిన తీరు చూసినప్పుడు మన చంద్రబాబు.. మన జగన్ లు సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సాక్ష్యాత్తు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ సర్కారును కడిగేసిన తీరు చూసినప్పుడు.. విభజనతో దారుణంగా నష్టపోయి.. ఫీలవుతున్న సీమాంధ్రులు ఎంతోకొంత ఊరట చెందటం ఖాయం.

రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా జేడీయూ ఎంపీ అలీ అన్వర్ అన్సారీ మాట్లాడుతూ.. బీహార్ ను కూడా ఇదే రీతిలో నాశనం చేశారని.. ముక్కలు చెక్కలు చేశారన్నారు. విభజన సమయంలో నాటి ప్రధాని ఏపీకి చాలా చేస్తామని హామీ ఇచ్చారని.. సభలోని సభ్యులు చాలామంది ఆ మాటలకు సాక్ష్యమన్నారు. ప్రధాని ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ఎలా? అని సూటిగా ప్రశ్నించిన సదరు బీహార్ ఎంపీ.. పార్టీ ఏదైనా.. ప్రధాని పదవిలో ఇచ్చిన హామీల్ని అధికారంలోకి వచ్చిన వారు ఎవరైనా నెరవేర్చాలి కదా? అని ప్రశ్నించారు.

సభలో చాలామంది రాముడి పేరును తరచూ ప్రస్తావిస్తుంటారని.. రాముడు దేవుడు ఎలా అయ్యాడని ప్రశ్నించిన ఆయన.. సుపరిపాలన అందించటం ద్వారా రాముడు దేవుడయ్యాడని.. ఆయన తమకు ఆదర్శమని చెప్పే పార్టీలు సుపరిపాలన అందించాలిగా? అంటూ బీజేపీ నేతలకు ఎలా కొడితే దిమ్మ తిరుగుతుందో అక్కడే కొట్టటం గమనార్హం. రామరాజ్య పాలన స్థాపనే ధ్యేయమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సదరు ఎంపీ చెలరేగిపోయారు. ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ ఎంపీ సుఖేందు రాయ్ ఏపీ ప్రత్యేక హోదా అంశం మీద మోడీ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. లోక్ సభ..రాజ్యసభ సాక్షిగా విభజన జరిగిందని.. నాడు రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ స్వయంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పది రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడిపోయాయని కేంద్రం చెబుతోందని.. మరి అలాంటి రాష్ట్రాల్ని కేంద్రం ఆదుకోవాలన్నారు. లేకపోతే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందవన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీఎంసీ తన పూర్తి మద్ధుతు ఇస్తుందని ప్రకటించారు. ఇక.. సీపీఎం అగ్రనేతల్లో ఒకరైన సీతారం ఏచూరి ఏపీ ప్రత్యేక హోదా మీద మాట్లాడారు. సిద్ధాంత పరంగా తాము ఏపీ రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకించామని.. కానీ లోక్ సభ.. రాజ్యసభ సాక్షిగా విభజన జరిగిందని.. సాక్ష్యాత్తు ప్రధాని ఇచ్చిన హామీకి విలువ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి.. పోతుంటాయని.. కానీ ప్రధాని హామీకి విలువ ఉండాలి కదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్.. బీజేపీ రెండూ మాట ఇచ్చాయని.. విభజన జరిగాక రెండు బడ్జెట్లు పెట్టారని.. ఇప్పటివరకూ ఏపీకి చేసిందేమీ లేదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా.. ఎవరికి వారు ఏపీకి జరిగిన అన్యాయంపై.. కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని తీవ్రస్థాయిలో తప్పు పడుతూ.. సూటిగా ప్రశ్నిస్తున్న వైనం చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. మన చంద్రబాబు.. మన జగన్ ల కంటే వేరే రాష్ట్రాలకు చెందిన వేరే పార్టీలే సో .. బెటర్ అని.