Begin typing your search above and press return to search.

ట్రంప్ ఓ వైర‌స్‌..దాన్ని దేశానికి రానివ్వ‌కండి

By:  Tupaki Desk   |   23 Feb 2017 8:01 AM GMT
ట్రంప్ ఓ వైర‌స్‌..దాన్ని దేశానికి రానివ్వ‌కండి
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వ్య‌తిరేకుల జాబితా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని ముస్లిం దేశాల్లోనే అగ్ర‌రాజ్యం అధిప‌తిపై నిర‌స‌న‌లు వెల్లువెత్త‌గా ఇప్పుడు ఆ బాబితాలో బ్రిట‌న్ చేరింది. ఆయ‌న బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తున్న ఆ దేశ పౌరులు అంత‌టితో స‌రిపుచ్చ‌కుండా... ట్రంప్ ఓ వైర‌స్ అని స‌ద‌రు వైర‌స్‌ ను మిగ‌తా దేశాల‌కు అంట‌కుండా చూడాల‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ వ‌స్తే బ్రిట‌న్ రాణి సిగ్గుప‌డాల‌నే వ్యాఖ్య‌లు కూడా చేస్తున్నార‌నంటే వారిలో ఏ మేర‌కు ఆగ్ర‌హం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ట్రంప్ బ్రిటన్‌ పర్యటనను ఇన్నాళ్లు కొంద‌రు పౌరులు మాత్ర‌మే వ్య‌తిరేకించ‌గా....ఇపుడు ఆ జాబితాలో దేశ పార్లమెంట్‌ సభ్యులు కూడా చేరిపోయారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక బ్రిటన్‌ ప్రధాని థెరీసా మే ఆయన్ని కలుసుకొని... తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేప‌థ్యంలో అత్యంత వివాదాస్పద, జాతి వివక్షతో కూడిన విధానాల్ని ట్రంప్‌ ఎంచుకున్న ఈ తరుణంలో, బ్రిటన్‌ పర్యటనకు ఆహ్వానించటం తమనెంతో నిరాశపర్చిందని థెరీసా మేపై వివిధ పార్టీల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ట్రంప్‌ పర్యటన అంశం చర్చకు వచ్చిన సంద‌ర్భంగా వివిధ పార్టీల ఎంపీలు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ 18 లక్షల 50 వేల మంది ఆన్‌ లైన్‌ పిటీషన్‌ దాఖలు చేసిన విషయాన్ని పార్లమెంట్‌ సభ్యులు ప్రస్తావించారు. ట్రంప్‌ పర్యటనను అడ్డుకోవాలని, ఆయన రావటం బ్రిటన్‌ రాణి సిగ్గుపడాల్సిన విషయమని ఆన్‌ లైన్‌ పిటీషన్‌ లో వారు స్పందించారు. ట్రంప్‌ కు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆయ‌న‌ నైతికంగా సరైనది కాదని పార్లమెంట్‌ లో చర్చ సందర్భంగా ఎంపీలు ప్రధాని థెరీసా మేను డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ లో ఈ చర్చ నడుస్తుండగా...పార్లమెంట్‌ బయట ట్రంప్‌ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. అమెరికాలో ఓ వైరస్‌ ప్రబలిందని, అది విస్తరించకుండా అడ్డుకోవాలని లేబర్‌ పార్టీ ఎంపీలు అన్నారు. ఈ ఏడాది చివర్లో డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌లో పర్యటించవచ్చని తెలుస్తోంది. ఆయన పర్యటనకు వ్యతిరేకంగా వివిధ వర్గాల నుంచి ప్రధాని థెరీసా మేపై తీవ్ర ఒత్తిడి వస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/