Begin typing your search above and press return to search.

కన్ఫర్మ్; యాకూబ్ మెమన్ ఉరి పక్కా

By:  Tupaki Desk   |   29 July 2015 5:44 PM GMT
కన్ఫర్మ్; యాకూబ్ మెమన్ ఉరి పక్కా
X
దాదాపు 22 ఏళ్ల తర్వాత న్యాయం అమలు కానుంది. ఈ దేశంలో చట్ట ప్రకారం ఒక వ్యక్తిని దండించాలంటే పట్టే కాలం ఇది. అది కూడా 257 మంది మరణానికి కారణమైన వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయటానికి చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాలు చూసినప్పుడు.. కొద్దిపాటి ఆశ్చర్యం కలగటం ఖాయం. వందలాది మంది ప్రాణాలు పోయేందుకు కారణమై.. ఉగ్రకుట్రకు సహాయ సహకారాలు అందించిన యాకూబ్ మెమన్ ను వత్తాసుగా బాలీవుడ్ కండల వీరు సల్మాన్ మూడు ఆలోచించి మరీ.. ట్విట్టర్ ట్వీట్ చేసి.. మళ్లీ లెంపలేసుకొని.. యాకూబ్ కు శిక్ష అమలు చేయకూడదన్న ట్వీట్ ను ఉపసంహరించుకోవటం తెలిసిందే.

ఇక.. మజ్లిస్ పార్టీ అధినేత.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే.. యాకూబ్ ఉరిశిక్ష అమలు ముస్లిం మైనార్టీ కాబట్టే అంటూ తన రాజకీయాన్ని ఈ విషయంలో కూడా ప్రదర్శించాడు. అంటే.. ముంబయి బాంబు పేలుళ్లలో చనిపోయిన 257 మంది మనుషులు కారా? వారికి ప్రాణాలు కావా? ముంబయి బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులుగా తేల్చిన 11 మందిలో యాకూబ్ ఒకరన్న విషయం మర్చిపోకూడదు.

అతగాడికి ఉన్న పలుకుబడి.. ఫాలోయింగ్ నేపథ్యంలో.. అతను తప్పు చేయకుంటే అతను బయటపడటం పెద్ద కష్టమయ్యేది కాదు. అతగాడు ఉగ్రవాదులకు కార్లు సప్లై చేశారన్న విషయం సాక్ష్యాల రూపంలో రుజువైన తర్వాత కూడా.. అసద్ లాంటి వాళ్లు మతాన్ని తెరపైకి తీసుకురావటం ఏమిటి? అంటే.. ఈ దేశంలో ఎవరేం చేసినా.. తాను కానీ గళం విప్పితే.. తాను చెప్పిన మాట ప్రకారమే జరగాలని అసద్ భావిస్తున్నారా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.

ఇక.. అతగాడికి ఉరిశిక్షను విధించి ఎంతో కాలం గడిచినా.. దాన్ని ఎప్పటికి అమలు చేయాలన్న దానిపై తర్జనభర్జలు జరిగి.. చివరకు జూలై 30 (అంటే గురువారం) అమలు చేయాలని నిర్ణయించారు. ఉరిశిక్ష అమలు గురించి అధికారిక ప్రకటన వెలువడిన నాటి నుంచి ఈ రోజు (బుధవారం) సాయంత్రం వరకూ ఏదో ఒక రూపంలో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

తనకు ఉరిశిక్ష అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటీషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి.. అతగాడికి విధించిన ఉరిని అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. యాకూబ్ మెమన్ కు జారీ చేసిన డెత్ వారెంట్ సక్రమమేనని తేల్చారు.మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ కు క్షమాభిక్ష కోసం పిటీషన్ దాఖలు చేయటం.. ఆయన దాన్ని తోసిపుచ్చటం గమనార్హం.

యాకూబ్ మెమన్ కు సంబంధించిన ఉరిశిక్ష అమలుకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. బుధవారం అర్థరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత నుంచి ఉదయం ఏడు గంటల లోపు ఏ క్షణంలో అయినా అతనికి ఉరిశిక్షను అమలు చేయొచ్చు. ఇక.. అతను రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తు ఒక్కటే పెండింగ్ లో ఉంది. కొద్ది నిమిషాల ముందే.. (ఈ వార్త రాసే సమయానికి) రాష్ట్రపతి తన వద్దనున్న క్షమాభిక్ష దరఖాస్తును తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. అతని ఉరిశిక్ష అర్థరాత్రి తర్వాత ఏప్పుడైనా అమలు చేయొచ్చు. అన్నట్లుగా యాకూబ్ జన్మదినోత్సవం కూడా.. ఆయనకు ఉరిశిక్ష అమలు రోజే కావటం గమనార్హం.