Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో ‘ఆ రాతల’కు మరణశిక్షేనా?

By:  Tupaki Desk   |   7 Oct 2015 3:17 PM GMT
సోషల్ మీడియాలో ‘ఆ రాతల’కు మరణశిక్షేనా?
X
విషయం ఏదైనా కానీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయటం సోషల్ మీడియాలో కామన్. ఈ సందర్భంగా కాస్త అటూఇటూగా తమ మనసులోని మాటల్ని రాసేస్తుంటారు. కొందరు విశ్లేషణలు చేస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని ఘాటుగా ఉంటే.. మరికొన్ని హద్దులు దాటేలా ఉంటాయి. అయితే.. శృతి మించిన రాతల విషయంలో చట్టపరమైన చర్యల్ని తీసుకోవటం తప్పు లేదు.

కానీ.. సౌదీ అరేబియాలో తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఆ దేశ రాజు తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా ఫేస్ బుక్.. ట్విట్టర్ లలో వదంతులు సృష్టించేలా ఎవరైనా రాతలు రాస్తే అలాంటి వారికి మరణశిక్షేనంటూ అధికారికంగా తీసుకున్న నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది.

సౌదీకి కొత్త రాజుగా సల్మాన్ పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మరణశిక్షల విధింపునకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మక్కాలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో పెద్ద ఎత్తున యాత్రికులు మరణించటంపై రాజవంశం మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు.. దీనిపై తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో.. తాజాగా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు.

సౌదీ అరేబియాలో ఈ మధ్యన మరణశిక్షలు విధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుందని.. చిన్న చిన్న కారణాలకే భారీ శిక్షలు అమలు చేస్తునారు. తాజాగా సోషల్ మీడియాలో వదంతులకు మరణశిక్షేనని పేర్కొనటం.. అవి ఎలాంటివన్న విషయంపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.