Begin typing your search above and press return to search.

మ‌న‌సు విరిగే స్కాం చెన్నైలో..!

By:  Tupaki Desk   |   22 Feb 2018 6:06 AM GMT
మ‌న‌సు విరిగే స్కాం చెన్నైలో..!
X
ఏం మాట్లాడాలి? ఎలా స్పందించాలి? ఎంత సంపాదించినా పోయేట‌ప్పుడు పావ‌లా కూడా వెంట తీసుకెళ్ల‌మ‌న్న విష‌యం తెలిసినా.. డ‌బ్బు కోసం మ‌రీ ఇంత‌గా దిగ‌జారిపోవాలా? సేవ ముసుగులో పాడెను కూడా దుర్మార్గ‌పు వ్యాపారంగా మార్చిన చీక‌టి ఉదంతం ఒక‌టి వెలుగు చూసింది. మూగ‌జీవాలు చ‌చ్చిపోతే.. వాటి చుట్టూ తిరిగి.. త‌మ బాధ‌ను.. ఆవేద‌ను వ్య‌క్తం చేస్తాయి. కానీ.. మ‌న‌సు ఉన్న దుర్మార్గ‌పు మ‌నిషి మాత్రం.. చ‌నిపోయిన శ‌వాల్ని సైతం వ్యాపారంగా మార్చేసుకుంటున్న వైనం విస్తుపోయేలా చేయ‌ట‌మే కాదు.. కంట క‌న్నీరు కారేలా చేస్తుంద‌ని చెప్పాలి.

చెన్నైలో వెలుగు చూసిన ఈ దుర్మార్గ‌పు స్కాం గురించి తెలిస్తే గుండెలు గుభేల్ అన‌ట‌మే కాదు.. ఎంత దుర్మార్గ‌మా? అన్న ఆవేశం.. ఆవేద‌న క‌ల‌గ‌లిసి రాక మాన‌దు.

వృద్ధాశ్ర‌మం ముసుగులో చ‌నిపోయిన ముస‌లివారి మృత‌దేహాల్ని కుళ్ల‌బెట్టి.. బాగా ఎండిన త‌ర్వాత వారి ఎముక‌ల్ని అమ్ముకుంటున్న నికృష్ట ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. చెన్నై పోలీసులు గుర్తించిన ఆ దారుణ దందా వివ‌రాల్లోకి వెళితే.. కాంచీపురంలోని పాలేశ్వ‌రం గ్రామంలో 19 ఎక‌రాల విస్తీర్ణంలో ఒక వృద్ధాశ్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. విదేశీ నిధుల‌తో నిర్వ‌హిస్తున్న ఈ వృద్ధాశ్ర‌మం పేరు సెయింట్ జోసెఫ్ క‌రుణై ఇల్ల‌మ్‌.

ఈ ఆశ్ర‌మంలో నా అన్న లేని వృద్ధులు.. మ‌తిస్థిమితం కోల్పోయిన వారు ఉంటారు. సుమారు 300 మంది వ‌ర‌కు ఉంటారు. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వృద్ధులు కూడా ఉన్నారు. అయితే.. ఈ వృద్ధాశ్ర‌మం మీద స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తుంటారు. వారు చేసే కంప్లైంట్స్ లో ముఖ్య‌మైంది. ఈ వృధ్దాశ్ర‌మం వెను భాగం నుంచి విప‌రీత‌మైన దుర్వాస‌న వ‌స్తుంద‌ని.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. ఆ ఆశ్ర‌మంలో ఉండే వృద్ధులు మ‌ర‌ణించిన త‌ర్వాత (?) వారి మృత‌దేహాల్ని శ్మ‌శానాల‌ను త‌ర‌లించ‌కుండా ఆ ఆశ్ర‌మం వెనుక 20 అడుగుల పొడ‌వు.. 40 అడుగుల వెడ‌ల్పు ఉన్న తొట్టెలాంటి గ‌దిలో పేర్చి పెడుతున్నారు. ఆ శ‌వాలు బాగా కుళ్లిపోయిన త‌ర్వాత మాంస‌పు భాగాలు ఆ గ‌ది కింద ఉన్న గోతిలో ప‌డిపోతాయి. ఆ త‌ర్వాత ఎముక‌ల గూళ్ల‌ను ఆశ్ర‌మ నిర్వాహ‌కులు విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నట్లుగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ ఈ దుర్మార్గం ఎలా బ‌య‌ట‌ప‌డింద‌న్న విష‌యానికి వ‌స్తే.. ఈ సంస్థ‌కు చెన్నై చుట్టుప‌క్క‌ల ప‌లు వృద్ధాశ్ర‌మాలు ఉన్నాయి. ఇందులో ఒక‌టైన చెన్నైలోని తాంబ‌రంలోని ఇరుంబులియూరు వృద్ధాశ్ర‌మానికి చెందిన 73 ఏళ్ల విజ‌య‌కుమార్ అక్క‌డి ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో రెండు రోజుల కింద‌ట మ‌ర‌ణించారు. మంగ‌ళ‌వారం అత‌డి మృత‌దేహాన్ని కూర‌గాయ‌ల వ్యాన్ లో మూట గ‌ట్టేసి వృద్ధాశ్ర‌మానికి త‌ర‌లిస్తున్నారు.

అయితే. అదే వాహ‌నంలో మ‌రో ఇద్ద‌రు వృద్ధులు (సెల్వ‌రాజ్ 72 - అన్న‌మ్మాళ్ 74) ఉన్నారు. వారు ర‌క్షించాల‌ని కేక‌లు వేయ‌టంతో వ్యాన్ ను నిలిపివేశారు. డ్రైవ‌ర్ ను నిల‌దీసి.. వృద్ధుల్ని ప్ర‌శ్నించ‌గా.. త‌మ‌ను ఆశ్ర‌మానికి త‌ర‌లిస్తున్నార‌ని.. అదే జ‌రిగితే తాము ప్రాణాల‌తో ఉండ‌మ‌ని చెప్ప‌టంతో ఈ విష‌యంలోకి పోలీసులు ఎంట‌ర్ అయ్యారు. వారు తీగ లాగ‌గా.. మొత్తం డొంక క‌ద‌ల‌ట‌మే కాదు.. వారి పాపాల పుట్ట ప‌గిలింది. శ‌వాల‌తో వ్యాపారం చేసే మ‌నుషులు మ‌న మ‌ధ్యే.. అది సేవ ముసుగులో ఉండ‌టం జీర్ణించుకోలేనిదిగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.