Begin typing your search above and press return to search.

ముంబై అటాక్‌...సేన‌తో హెడ్లీ దోస్తీ!

By:  Tupaki Desk   |   13 Feb 2016 4:59 AM GMT
ముంబై అటాక్‌...సేన‌తో హెడ్లీ దోస్తీ!
X
డేవిడ్ హెడ్లీ...ఇపుడీ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ముంబయి విమానాశ్రయం - నావికాదళ స్థావరంపై దాడి చేయాలనే ఐఎస్‌ ఐ - లష్కరే తోయిబా లక్ష్యాల‌ను విజ‌య‌వంతంగా అమ‌లుచేసేందుకు చురుగ్గా ప‌నిచేసిన జిహాదీ! ముంబయి దాడి కేసులో అప్రూవర్‌ గా మారి అమెరికా నుండి వీడియో ద్వారా ముంబయి కోర్టుకు గత కొన్ని రోజులుగా సాక్ష్యమిస్తున్న హెడ్లీ సంచ‌ల‌నాల‌ను వెలుగులోకి తెస్తున్నాడు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని తీవ్రంగా ఇరుకున పెట్టిన ఇష్రాత్ జ‌హాన్ ఎన్‌ కౌంట‌ర్ విష‌యాన్ని ఉద‌హ‌రిస్తూ ఆమెకు ఉగ్ర‌వాదుల‌తో సంబంధం ఉంద‌నే అంశం మోడీకి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో శివ‌సేన‌తో త‌న అనుబంధం గురించి హెడ్లీ మ‌రో షాకింగ్ కామెంట్ చేశాడు.

బాబా అణు పరిశోధనా కేంద్రాన్ని (బార్క్‌), సిద్ధి వినాయక ఆలయాన్ని తాను వీడియో తీశానని, అక్కడ పనిచేసే వారినెవరినైనా ఐఎస్‌ ఐతో కలిసి పనిచేసేందుకు రిక్రూట్ చేసేలా చూశాన‌ని చెప్పారు. సిద్ధి వినాయక ఆలయం వెలుపల ఆమ్ముతున్న రిస్ట్‌ బాండ్లు ఎరుపు - పసుపువి పది వరకు కొన్నానని, వాటిని ధరిస్తే హిందువుల్లా కనపడతారని ఇలా చేశాన‌ని వివరించాడు. దక్షిణ ముంబయి చాబాద్‌ హౌస్‌ ను కూడా తాను సర్వే చేసి, వీడియో తీశానని చెప్పాడు. అందులో ఎవరుంటారో తెలియకపోయినా అది యూదులు, ఇజ్రాయిలీలు నివసించే ప్రాంతమని చెప్పాడు. నావికాదళ స్థావరంపై, సిద్ధి వినాయక ఆలయంపై దాడులు వద్దని తాను లష్కరేను కోరానని తెలిపాడు.

ఇంతేకాకుండా శివసేన సభ్యుడితో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించానని హెడ్లీ చెప్పాడు. సేన భవన్ 'మాతోశ్రీ‌' పై దాడి చేయడానికి లేదా శివసేన నేతను హతమార్చడానికి భవిష్యత్తులో లష్కరే తోయిబా ప్రణాళిక వేస్తుందని తాను భావించానని హెడ్లీ చెప్పాడు. ల‌ష్క‌రే తోయిబా ప్లాన్‌ లు - త‌ను ప‌నిచేస్తున్న విధానం గురించి చ‌ర్చించేందుకు లష్కరే తోయిబా నేత జాకిర్‌ రెహమాన్‌ లఖ్వి - సాజిద్‌ మిర్‌ - మేజర్‌ ఇక్బాల్‌ ప్రభృతులతో పాకిస్తాన్‌ లో చాలాసార్లు సమావేశాలు జరిపానని తెలిపాడు. తాను రెక్కీ చేసిన కొన్ని ప్రాంతాలు మేజర్‌ ఇక్బాల్‌ కు నచ్చలేదని, పైగా ముంబయి విమానాశ్రయాన్ని లక్ష్యంగా ఎంపిక చేయనందుకు ఆయన అసంతృప్తిగా ఫీల‌య్యారని హెడ్లీ వివ‌రించాడు. కఫీ పరేడ్‌ లోని బాద్వార్‌ పార్క్‌ ను తీవ్రవాదులు దిగడానికి సరైన స్థలంగా తాను ఎంపిక చేశానని, అది మెయిన్‌ రోడ్‌ కు దూరంగా గుడిసెలతో వుంది కాబట్టి వారికి అనువుగా వుంటుందని భావించానన్నారు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర దిగడానికి స్థలాన్ని ఖరారు చేయమని జాకీర్‌ రెహమాన్‌ తనను కోరాడని, కానీ తాను తిరస్కరించానని, అక్కడైతే తొందరగా దొరికిపోవడానికి వీలుంటుందని చెప్పానన్నాడు.

విచార‌ణ సంద‌ర్భంగా హెడ్లీ చెప్పిన మాట‌ల‌తో దేశంలో ఎంత పెద్ద ఎత్తున అల‌జ‌డి సృష్టించేందుకు ఐఎస్ ఐ, ల‌ష్క‌రే తోయిబాలు ప్ర‌య‌త్నం చేశాయో తెలుసుకొని ఇపుడు ఆశ్చ‌ర్యపోవ‌డం దేశం వంతు అవుతోంది.