Begin typing your search above and press return to search.

చంద్రుడిపై నీరు.. మరి జీవం.?

By:  Tupaki Desk   |   21 Aug 2018 11:58 AM GMT
చంద్రుడిపై నీరు.. మరి జీవం.?
X
ఈ విశ్వంలో భూమి మీద మాత్రమే జీవం ఉంది. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు వివిధ గ్రహాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎక్కడా జీవం జాడ తెలియలేదు. మనకు సమీపంలో ఉన్న అంగారక గ్రహంపై జీవం జాడ కోసం వెతుకుతున్నారు. ఇక భూమినుంచి ఏర్పడిన చంద్రుడిపై కూడా జీవ జాడ కోసం ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు.

తాజాగా నాసా సంచలన విషయం వెల్లడించింది. చంద్రుడిపై ఘనీభవించిన నీటి నిక్షేపాలు ఉన్నట్టు చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ గుర్తించిందని తెలిపింది. ఈ నీటి నిక్షేపాలు చంద్రుడిపై అత్యంత చల్లగా.. చీకటిలో ఉండే ప్రాంతంలో ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ ప్రాంతంలో మంచు ఉండడంతో నీరు దొరికే చాన్స్ ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని విషయాలను గురించి అన్వేషించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

చంద్రుడి దక్షిణ దృవం వద్ద లూనార్ క్రేటార్స్ ప్రాంతంలో మంచు ఉన్నట్టు నాసా గుర్తించింది. ఉత్తర ధృవం వద్ద మాత్రం అక్కడక్కడా మంచు కనిపించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాసాకు చెందిన మూన్ మినియురాలజీ మ్యాపర్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఖచ్చితంగా నీటి ఆనవాలు ఉన్నాయని తేల్చారు.

భారత్ ప్రయోగించిన చంద్రయాన్ -1 స్పేస్ క్రాఫ్ట్ లో m3 పరికరాన్ని అమర్చారు. దీని సాయంతోనే నీటి ఆనవాళ్లపై నాసా విశ్లేషించి నీటి జాడనకు కనుగొంది. ప్రస్తుతం ఈ నీటి ఆనవాలు ఘనీభవించిన ఉత్తర - దక్షిణ ధృవ ప్రాంతాల్లోనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ మైనస్ 156 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి చంద్రుడిపై మంచు ఉందన్న శాస్త్రవేత్తల అంచనాలు నిజమయ్యాయి. ఆ మంచులో జీవం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంటుంది.