టీడీపీ అవినీతి!... ఈయన లెక్కలేసి చెప్పారు!

Sat Feb 16 2019 14:11:42 GMT+0530 (IST)

టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాలనలో అధికార పార్టీ నేతల అవినీతి హద్దులు దాటిపోయిందని ప్రతి చిన్న పనిలోనూ అధికార పార్టీ నేతలకు మామూళ్లు అందకుంటే ముందుకు కదిలే పరిస్థితి లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు విపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ఆరోపణలే కాదు... గడచిన ఎన్నికల్లో టీడీపీ విజయానికి దోహదపడ్డ బీజేపీ - జనసేనల మాట కూడా ఇదే. టీడీపీతో పొత్తు ఉండగానే బీజేపీ ఈ తరహా ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ అయితే... చంద్రబాబు అధికార నివాసానికి కూతవేటు దూరంలోని గుంటూరులో నిర్వహించిన సభ ద్వారా టీడీపీ జమానాలోని అవినీతిపై సంచలన ఆరోపణలు గుప్పించారు. మొత్తంగా టీడీపీ పాలనలో ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందని అన్ని వర్గాలు ఆరోపించినట్లైంది.ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి గానీ... ఈ దందా ద్వారా తెలుగు తమ్ముళ్లు - ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యేలు ఏ మేర సంపాదించారన్న విషయంపై మాత్రం నిన్నటిదాకా పెద్దగా క్లారిటీ లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆ క్లారిటీ కూడా వచ్చేసింది. మొన్నటిదాకా టీడీపీలోనే ఉండి... నిన్ననే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త - విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేశ్... టీడీపీ అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత అవినీతి ఇప్పటి టీడీపీ పాలనలో చూస్తున్నానని - ఈ తరహా అవినీతి పాలనతో టీడీపీ అంటేనే విరక్తి కలిగిందని కూడా ఆయన కుండబద్దలు కొట్టేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగా... ఆ తర్వాత రెండేళ్లలోనే ప్రతి టీడీపీ ఎమ్మెల్యే రూ.100 కోట్ల మేర వెనకేసుకున్నారని జై రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండేళ్లలో రూ.100 కోట్లను దోచేసిన ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే.... గడచిన మూడేళ్లలో మరో రూ.300 కోట్ల మేర వెనకేసుకున్నారని ఆయన ఆరోపించారు.

ప్రతి పనిలో 20 నుంచి 30 శాతం దాకా కమీషన్లు దండుకుంటున్న టీడీపీ నేతలు... ఏ ఒక్క పనినీ వదలడం లేదని కూడా జై రమేశ్ చెప్పారు. ఇదేదో తాను కాకి లెక్కలు చెప్పడం లేదని... తమ అవినీతి దందాను టీడీపీ నేతలే స్వయంగా చెప్పారని దోపిడీ చేస్తున్న తమ దమన నీతికి సిగ్గుపడాల్సింది పోయి... గొప్పలు చెప్పుకుంటున్న తెలుగు తమ్ముళ్ల తీరు తనకు కంపరం పుట్టించిందని కూడా జై రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా దోచుకునే నేతలు ప్రజలకు ఏం సేవ చేస్తారని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మొత్తంగా టీడీపీ పాలన... తెలుగు జాతిని హీనాతి హీనమైన స్థతిలోకి తీసుకెళ్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బాబు జమానాలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాధాన్యం దక్కిందన్న విషయాన్ని కూడా ఆయన నిర్ధారించేశారు.