Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ది ర‌జాకార్ల జ‌మానా

By:  Tupaki Desk   |   25 July 2016 3:00 PM GMT
కేసీఆర్‌ ది ర‌జాకార్ల జ‌మానా
X
సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా - సొంత నియోజకవర్గంలో మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలపై లాఠీఛార్జి చేయడం ద్వారా ప్రభుత్వ పాలన రజాకార్ల జమానను తలపిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ ఫైరయ్యారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప‌రిధిలోని ముంపు గ్రామాల ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ దామోదర్ రాజనర్సింహ్మ - మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి - సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై పోరాటాన్ని ఉదృతం చేస్తామని అన్నారు.

లాఠీచార్జీ గురించి మాట్లాడాలంటే నోట్లో నుండి పదాలు రావడంలేదని, ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడా చూడలేదని దామోద‌ర‌ మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు మహిళలని కూడా చూడకుండా దారుణంగా లాఠీఛార్జి చేశారన్నారు. భాష్పావాయువు ప్రయోగించి గాలిలోకి కాల్పులు జరిపడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఎర్రవల్లి గ్రామంలో 2వేల మంది గ్రామస్తులను దిగ్భందం చేసి ఆడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్‌ డే అని - తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలపై పోలీసులతో లాఠీఛార్జి చేయించ‌డం దారుణమన్నారు. బూటు కాళ్ళతో - తుపాకులతో దారుణంగా కొట్టారని నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గకేంద్రంలోనే ప్రభుత్వాసుపత్రిలో సదుపాయాలు కరువయ్యాయని బాధితుల‌కు స‌హాయం చేసే ప‌రిస్థితిలో ద‌వాఖాన లేద‌న్నారు.

అనంతరం పార్టీ నేత‌లతో క‌లిసి వారు గజ్వేల్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు మూడు కిలోమీటర్ల మేర ప్రజ్ఞాపూర్‌ వరకు పాదయాత్రగా వెళ్ళి రాజీవ్‌ రహదారిపై అరగంట పాటు ధర్నా - రాస్తారోకో నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌ దిష్టబొమ్మను దహనం చేశారు.