వైఎస్సార్సీపీ గెలిస్తే స్పీకర్ ఆయనే - బాబుకు ఇబ్బందే!

Sat Apr 20 2019 20:11:04 GMT+0530 (IST)

అధికారం దక్కాలి కానీ - తెలుగుదేశం అధినేత చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టేలా ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు. ఈ ఆలోచన వారికైనా ఉందో లేదో కానీ… మీడియా సర్కిల్స్ లో  అయితే ఆసక్తిదాయకమైన ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అధికారం అందితే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపెట్టేలా రాజకీయ ప్రణాళిక ఉందని టాక్!అందులో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పదవికి కూడా ఒక ఆసక్తిదాయకమైన వ్యక్తిని ఎంపిక చేసే ఉద్దేశంతో ఉన్నారట వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే స్పీకర్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. ఎలాగూ స్పీకర్ పదవి అధికారంలో ఉన్నవారికే దక్కే సంప్రదాయం నడుస్తూ ఉంది. ఎమ్మెల్యేగా దగ్గుబాటి విజయం కూడా అంత కష్టమైనేదేమీ కాదు. వైఎస్సార్సీపీ గెలిచే గాలే ఉంటే.. దగ్గుబాటి ఎమ్మెల్యే కావడం ఖాయం.

ఇలాంటి నేపథ్యంలో ఆయననే స్పీకర్ గా చేయనున్నారట. ప్రత్యేకంగా ఆయననే ఎంపిక చేయడం వెనుక చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్లాన్ ఉందని టాక్. ‘దగ్గుబాటి అసెంబ్లీలో కనిపించకూడదు..’ అని అప్పుడెప్పుడో అన్నారట చంద్రబాబు నాయుడు. బాబుకు తోడల్లుడే అయినా వారిద్దరి మధ్యన ఉన్న వైరం అందరికీ తెలిసిన సంగతే. ఈ క్రమంలో దగ్గుబాటిని అసెంబ్లీలో అడుగుపెట్టనీయకూడదని బాబు ఒక సమయంలో అనుకున్నారట. అయితే కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు దగ్గుబాటి ఎమ్మెల్యేగా వ్యవహరించారు.

ఇక ఈ సారి ఏకంగా స్పీకర్ స్థానంలో ఆయనను కూర్చోబెట్టి చంద్రబాబును మరింత ఇరకాటంలోకి నెట్టాలని వైఎస్సార్సీపీ వర్గాలు అనుకుంటున్నట్టుగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. దగ్గుబాటి స్పీకర్ సీట్లో కూర్చుంటే చంద్రబాబు నాయుడు ఆయనను ‘అధ్యక్ష..’అంటూ మాట్లాడాల్సి రావడం ఒక ఆసక్తిదాయకమైన ఘట్టం అవుతుందనేది జర్నలిస్టుల ఉవాచ!