Begin typing your search above and press return to search.

రాహుల్ తో నారా బ్రాహ్మ‌ణి భేటీ!

By:  Tupaki Desk   |   14 Aug 2018 10:54 AM GMT
రాహుల్ తో నారా బ్రాహ్మ‌ణి భేటీ!
X
కాంగ్రెస్ తో జ‌త కట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని కొంత‌కాలంగా పుకార్లు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే.అందుకు త‌గ్గ‌ట్లుగానే కొద్ది రోజుల క్రితం ...చంద్ర‌బాబు..రాహుల్ - సోనియాల‌తో భేటీ అయ్యారు. ఏపీకి హోదా ఇచ్చే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌కటించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు కోడ‌లు - హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ నారా బ్రాహ్మ‌ణి ...రాహుల్ ను క‌లవ‌డం సంచ‌ల‌నం రేపింది. కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు రాహుల్ ను టీడీపీకి చెందిన బ్రాహ్మ‌ణి క‌ల‌వ‌డం ...ఇరు రాష్ట్రాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలుగు పారిశ్రామికవేత్తలతో రాహుల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ హోదాలో పాల్గొని ప్ర‌సంగించారు. తాజ్‌ కృష్ణా హోటల్‌ లో 200 మంది యువ పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్న ఈ సమావేశానికి బ్రాహ్మ‌ణి కూడా హాజ‌రయ్యారు.

రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం రాహుల్ తెలంగాణ‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దాదాపు 200 మందికి పైగా తెలుగు పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే, హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు హోదాలో బ్రాహ్మణిని ఈ సమావేశానికి ఆహ్వానించారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు సౌకర్యాలు - సదుపాయాలపై వారి నుంచి సలహాలు - సూచనలను రాహుల్ స్వీక‌రించారు. తెలంగాణలో పారిశ్రామికవేత్తల పరిస్థితి - పారిశ్రామిక పాలసీ - జీఎస్టీ వల్ల ఎదురవుతోన్న ఇబ్బందులపై సమావేశంలో చర్చించారు. ఈ సంద‌ర్భంగా యువ పారిశ్రామిక వేత్త‌లు ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లు - ఇబ్బందుల‌ను రాహుల్ దృష్టికి బ్రాహ్మ‌ణి తీసుకువెళ్లారు. ప‌లు స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు. ఈ స‌మావేశానికి నారా బ్రాహ్మణి - దగ్గుబాటి సురేష్ - టీజీ భరత్ ల‌తో పాటు దాదాపు 200మంది చిన్న - మధ్యతరహా యువ పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.