Begin typing your search above and press return to search.

2,232 కోట్ల హ‌వాలా స్కాం బ‌ట్ట‌బ‌య‌లు

By:  Tupaki Desk   |   29 Aug 2016 1:12 PM GMT
2,232 కోట్ల హ‌వాలా స్కాం బ‌ట్ట‌బ‌య‌లు
X
అతి పెద్ద హ‌వాలా స్కాంను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ ఐ) బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. నాలుగు జాతీయ బ్యాంకులు - ఒక ప్రైవేటు బ్యాంకు కొంద‌రు వ్య‌క్తులు క‌లిసి వేల కోట్ల సొమ్మును హ‌వాలా మార్గంలో విదేశాల‌కు త‌ర‌లించేస్తున్న‌ వైనాన్ని గుర్తించింది. అది కూడా ఓ స్వీప‌ర్‌ - కార్మికుడు - టికెట్ క‌లెక్ట‌ర్‌ - పానీపూరి అమ్ముకునే చిరు వ్యాపారి పేర్ల‌తో ఈ హ‌వాలా వ్య‌వ‌హారం సాగిన‌ట్టు వెల్ల‌డించింది. గ‌త సంవత్సరం అక్టోబర్ నుంచి 2016 మార్చి వరకు దక్షిణ ముంబైలోని బ్యాంకు శాఖ‌ల ద్వారా ఈ తతంగం జ‌రిగిన‌ట్టు తెలిపింది. సినిమాహాల్లో పనిచేసే ఒక కార్మికుడి పేరుతో ఖాతా తెరిచి.. దాన్నుంచి విదేశాల్లో ఉన్న వేరే ఖాతాకు రూ. 400 కోట్లు పంపారు.

అలాగే గొవాండీ రైల్వే స్టేషన్‌ లో పనిచేసే ఒక స్వీపర్ - ఒక టికెట్ కలెక్టర్ - ఘట్కోపర్ వద్ద పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి.. వీళ్ల పేర్లతో ఖాతాలు తెరిచి రూ. 400-600 కోట్ల వరకు విదేశీ ఖాతాలకు పంపారు.ఈ స్కాం మొత్తం ఒక కంపెనీ ద్వారానే జరిగిందని - దాని అడ్రస్ మస్జిడ్ బందర్ ప్రాంతంలో ఉన్నట్లు చూపించారని - ఆగ్నేయాసియా దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నట్లు చెప్పారని అన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం మొత్తం స్కాం విలువ రూ. 2,232 కోట్లని తెలిపారు.

ఈ మొత్తంతో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కొనుగోలు చేయాల‌ని పేర్కొన్నార‌ని, అయితే, వారు చూపిన వ‌స్తువుల విలువ కేవ‌లం పాతిక కోట్లుగా మాత్ర‌మే ఉంటుంద‌ని అధికారులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇంత పెద్ద పెద్ద లావాదేవీలు జరుగుతున్నా వాటిని బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం పైనా కేసులు న‌మోదు చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. కాగా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల‌కు ముందు న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకొస్తామ‌ని ఇచ్చిన పిలుపులో భాగంగా అధికారులు సాగించిన త‌నిఖీలో ఈ విష‌యాలు వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం.