Begin typing your search above and press return to search.

త‌మిళుల‌కు మ‌రో షాక్‌..ఆసుప‌త్రిలో పెద్దాయ‌న‌

By:  Tupaki Desk   |   16 Aug 2017 5:35 AM GMT
త‌మిళుల‌కు మ‌రో షాక్‌..ఆసుప‌త్రిలో పెద్దాయ‌న‌
X
గ‌డిచిన కొంత కాలంగా త‌మిళుల‌కు స‌మ‌స్య‌ల మీద స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. మ‌రోసారి త‌మిళులు పెద్దాయ‌న‌గా ఫీల‌య్యే డీఎంకే చీఫ్ క‌రుణానిధి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న ఆరోగ్యం ఇబ్బందిక‌రంగా మార‌టంతో ఆయ‌న్ను హుటాహుటిన కావేరీ ఆసుప‌త్రికి చేర్చారు.

గ‌డిచిన కొంత‌కాలంగా ఏదో ఒక విప‌త్తు త‌మిళ‌నాడుకు ఎదురవుతోంది. ఆ మ‌ధ్య‌న వ‌రుస పెట్టి వ‌చ్చి ప‌డ్డ ప్ర‌కృతి వైప‌రీత్యాలు.. వాటిల్లో నుంచి బ‌య‌ట‌ప‌డేస‌రికి వారెంతో అభిమానించే అమ్మ అనారోగ్యం.. ఆపై ఆస్త‌మ‌యం.. త‌ర్వాతి కాలంలో నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చితి వాతావ‌ర‌ణం తెలిసిందే.

ఆ మ‌ధ్య వ‌ర‌కు త‌మిళ‌నాడుకు రెండు మేరు ప‌ర్వ‌తాల్లాంటి జ‌య‌.. క‌రుణ‌ల అండ ఉంద‌ని సంతోషించిన త‌మిళుల‌కు.. అమ్మ అనుకోని రీతిలో తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోగా.. వ‌యోభారంతో పెద్దాయ‌న క‌రుణానిధి ఇబ్బందులు ప‌డుతున్నారు. గ‌డిచిన కొంత‌కాలంగా ఆయ‌న ఆరోగ్యం ఏమాత్రం బాగుండ‌టం లేదు. నిజానికి అమ్మ జ‌య‌ల‌లిత అనారోగ్యంతో ఆసుప‌త్రికి చేరిన స‌మ‌యంలోనే.. క‌రుణానిధి కూడా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేర‌టం త‌మిళుల్ని క‌లిచివేసింది. అయితే.. త‌ర్వాత కోలుకున్న ఆయ‌న ఇంటికి వెళ్లారు.

కొద్ది రోజులుగా క‌రుణ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేద‌న్న మాట వినిపిస్తోంది. దీనికి బ‌లం చేకూరుస్తూ డీఎంకేకు చెందిన ముర‌సోలి ప‌త్రిక 75వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా భారీ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. మ‌రో ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఇద్ద‌రూ హాజ‌ర‌య్యారు. ప‌లువురు రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైనా.. పార్టీకి అన్నీ తానైన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే క‌రుణ మాత్రం అనారోగ్య కార‌ణంగా హాజ‌రు కాలేదు. ఇదిలా ఉండ‌గా.. ఈ తెల్ల‌వారుజామున క‌రుణ ఆరోగ్య ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌టంతో ఆయ‌న్ను చెన్నైలోని కావేరీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. గొంతు.. శ్వాస‌కోస స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న బాధ ప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు.

గ‌త డిసెంబ‌రులో కూడా ఆయ‌న ఇవే స‌మ‌స్య‌ల‌తో కావేరీ ఆసుప‌త్రిలో చేరారు. క‌రుణానిధి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరార‌న్న వార్త బ‌య‌ట‌కు రావ‌టంతో డీఎంకే పార్టీ నేత‌లు.. అభిమానులు.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున కావేరీ ఆసుప‌త్రికి చేరుకుంటున్నారు.