డి కె శివకుమార్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు?

Mon Dec 10 2018 13:37:27 GMT+0530 (IST)

తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు చాలా అయోమయంలో ఉంది! అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ను చేరుకుంటామని - సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆ పార్టీ బయటకు ధీమాగానే చెప్తోంది. ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వేలో ఆ విషయం తేలిన సంగతిని పదే పదే ప్రస్తావిస్తోంది. టీఆర్ ఎస్ ను తాము గద్దె దింపడం ఖాయమని సూచిస్తోంది.అయితే - బయటకు కనిపిస్తున్నంత ధైర్యంగా కాంగ్రెస్ లేదట. గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య పెరుగుతుందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేమని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం కొన్ని సీట్లయినా తక్కువ పడటం ఖాయమని అనుకుంటున్నారట.

అందుకే కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన కర్ణాటక నేత డి.కె.శివకుమార్ ఇప్పటికీ హైదరాబాద్ లోనే ఉన్నారట. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంలో తక్కువయ్యే సీట్లను కాంగ్రెస్ కు సాధించిపెట్టడంపై ఆయన దృష్టిసారించారట. గెలిచే అవకాశాలు బలంగా ఉన్న స్వతంత్ర్య అభ్యర్థులతో ఇప్పటికే శివకుమార్ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ లోని కొందరు నేతలపై కూడా ఆయన కన్నేశారట.

హంగ్ అసెంబ్లీ ఏర్పడితే టీఆర్ ఎస్ ను చీల్చాలన్నది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ అని తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రధానంగా టీఆర్ ఎస్ లోని ఎస్సీ - కమ్మ నేతలతో డి.కె.శివకుమార్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఫలితాల అనంతరం అవసరమైతే కాంగ్రెస్ కు సహాయం చేసేందుకు ఈ నేతలు గులాబీ గూటిని వీడే అవకాశముందట.

మరోవైపు - మజ్లిస్ ను బుజ్జగించేందుకు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ను కాంగ్రెస్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 6-8 సీట్లు గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో చెప్పాయి. కాబట్టి ఆ పార్టీ అండ లభిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ దిశగా అసదుద్దీన్ ఒవైసీతో ఆజాద్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మజ్లిస్ టీఆర్ ఎస్ కు తమ మద్దతు ప్రకటించింది. టీఆర్ ఎస్ - బీజేపీ ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తే మాత్రం ఎంఐఎం వెంటనే తమ మద్దతును కాంగ్రెస్ కు షిఫ్ట్ చేసే అవకాశముంది. మొత్తానికి టీఆర్ ఎస్ మళ్లీ అధికారంలోకి రాకుండా చూసేందుకు డి.కె.శివకుమార్ - ఆజాద్ బాగానే కష్టపడుతున్నారన్నమాట!