Begin typing your search above and press return to search.

ఈసారీ డీకేఅరుణ మాట కేసీఆర్ వినక తప్పదా?

By:  Tupaki Desk   |   20 Oct 2016 5:30 AM GMT
ఈసారీ డీకేఅరుణ మాట కేసీఆర్ వినక తప్పదా?
X
తనకు నచ్చినట్లు మాత్రమే చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తన రాజకీయ ప్రత్యర్థుల మాటల్ని పరిగణలోకి తీసుకోవటానికి ససేమిరా అంటుంటారు. నిజానికి ఇలాంటి వైఖరి రాజకీయాల్లో కామనే. కాకుంటే కేసీఆర్ లో ఉండే విలక్షణత ఏమిటంటే..ఏదైనా ఇష్యూ మీద ప్రత్యర్థులు మాట్లాడితే దాన్ని పట్టించుకోనట్లుగా ఉంటూనే.. ఇష్యూ తీవ్రత పెరిగితే మాత్రం.. రాజకీయాల్ని.. భేషజాల్ని పక్కన పెట్టేసిన చటుక్కున నిర్ణయం తీసుకోవటం కనిపిస్తుంది. మొండితనం ఉన్నప్పటికీ.. దాన్ని కొంతమేర వరకే పరిమితం చేసే గుణం కేసీఆర్ లో కనిపిస్తుంది. ప్రజాగ్రహం కలిగించే అంశాలపై ఆయన ఎక్కువ పట్టుదలకు పోరనే చెప్పాలి.

ఎందుకిలా అంటే.. కేసీఆర్ ఉద్యమ బ్యాక్ గ్రౌండ్ అనే చెప్పాలి. ఉద్యమనేతగా ప్రజా ఉద్యమాల గురించి కేసీఆర్ కు ఉన్న అవగాహనే దీనికి కారణంగా చెప్పాలి. ఇగోలతో ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుంటే కలిగే నష్టం మీద ఆయనకు అవగాహన ఉండటంతో.. అలాంటి అవకాశాన్ని ప్రత్యర్థులకు ఇవ్వకూడదని ఆయన ఫీల్ అవుతారు. అవసరమైతే కాస్త తగ్గినా తప్పు లేదు కానీ ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వటం రాజకీయంగా ఏ మాత్రం మంచిది కాదన్నది ఆయన భావన.

తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుపై గద్వాల జిల్లా ఏర్పాటు విషయంలోనే కాకుండా జనగామ జిల్లా విషయంలోనూ ఆయన ప్రజా ఉద్యమాల్ని.. విపక్షాల వినతుల్ని పరిగణలోకి తీసుకోవటాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ అధికారపక్షానికి బద్ధశత్రువు.. కేసీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకించే డీకే అరుణ డిమాండ్ చేసిన గద్వాల జిల్లాను కేసీఆర్ ఓకే చేయటం తెలిసిందే. భావోద్వేగ రాజకీయ కళ్లాల్ని రాజకీయ ప్రత్యర్థులకు ఇచ్చేందుకు ఇష్టపడని కేసీఆర్..కాస్త తగ్గి మరీ వారి డిమాండ్లను ఓకే అనటం ద్వారా కింద పడినా తనదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే కేసీఆర్ కు మరోసారి ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవల ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలకు సంబంధించిన పేర్ల విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గద్వాల జిల్లాను జోగులాంబగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో పలువురు గందరగోళానికి గురి అవుతున్నారని అందుకే.. ఆ పేరును జోగులాంబ గద్వాల జిల్లాగా పేర్కొనాలని అదే విధంగా రాజన్న పేరుతో ఏర్పాటు చేసిన సిరిసిల్ల జిల్లాను రాజన్న సిరిసిల్ల అని.. జయశంకర్ జిల్లాకు భూపాలపల్లి అని.. కుమ్రం భీమ్ జిల్లాకు అసిఫాబాద్ అని.. భద్రాద్రికి కొత్తగూడెం అన్న పేర్లు కలపాలన్న డిమాండ్లు ఉన్నాయి. అన్నింటికి కంటే ఎక్కువగా జోగులాంబ జిల్లాకు గద్వాల పేరు చేర్చాలని డీకే అరుణ డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి పేరు పక్కనే భువనగిరి చేర్చిన వేళ.. డీకే అరుణ కోరుకున్నట్లుగా జోగులాంబకు గద్వాల పేరు కలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. తన రాజకీయ ప్రత్యర్థి అయిన డీకే అరుణ డిమాండ్ ను కేసీఆర్ మరోసారి నెరవేర్చినట్లు అవుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/