Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను క‌ట్ట‌ప్ప‌తో పోల్చేసిన డీకే!

By:  Tupaki Desk   |   18 March 2017 9:53 AM GMT
కేసీఆర్‌ ను క‌ట్ట‌ప్ప‌తో పోల్చేసిన డీకే!
X
టాలీవుడ్ ఎపిక్ పిక్చ‌ర్ బాహుబ‌లి-2 ట్రైల‌ర్‌... తెలుగు నేల రాజ‌కీయాల‌కు బాగానే ఒంట‌బ‌ట్టేసిన‌ట్లుంది. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌ - రానా ద‌గ్గుబాటి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఎస్ ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బాహుబ‌లి-1 చిత్రం ఒక్క టాలీవుడ్ రికార్డుల‌నే కాకుండా యావ‌త్తు భార‌తీయ సినీ జ‌గత్తు రికార్డుల‌ను తిర‌గ‌రాసేసింది. ఇక మొన్న విడుద‌లైన ఈ చిత్రం సెకండ్ పార్ట్ బాహుబ‌లి-2 ట్రైల‌ర్ విడుద‌లైన 24 గంట‌ల్లోనే 2 కోట్ల‌కు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌ నే కాకుండా మొత్తం సోష‌ల్ మీడియానే షేక్ చేసేసింది.

ఈ క్ర‌మంలో నిన్న తెలంగాణ అసెంబ్లీలో విప‌క్ష నేత‌గా ఉన్న టీ కాంగ్ సీనియ‌ర్ నేత కుందూరు జానారెడ్డి నోట బాహుబ‌లి మాట వినిపించింది. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ అప‌స‌వ్య విధానాల నుంచి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు బాహుబ‌లి రావాలేమోన‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన జానా... తెలంగాణ రాజ‌కీయాల్లోకి మాత్రం బాహుబ‌లి ఎంట్రీ ఖాయ‌మేన‌న్న వాద‌న‌ను కూడా వినిపించారు. తాజాగా నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన టీ కాంగ్ మ‌హిళా నేత‌ - మాజీ మంత్రి డీకే అరుణ‌... జానా వ్యాఖ్య‌ల‌కు కొన‌సాగింపుగా మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు.

జానారెడ్డి చెప్పిన బాహుబ‌లి కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తార‌ని చెప్పిన డీకే... బాహుబ‌లి చిత్రంలో క‌ట్ట‌ప్ప పాత్ర మాత్రం కేసీఆరేన‌ని త‌న‌దైన శైలిలో తెలంగాణ సీఎంపై సెటైర్లేశారు. అంత‌టితో ఆగ‌ని డీకే... తెలంగాణ‌లో న‌డుస్తున్న ప్ర‌స్తుత రాజ‌కీయం మొత్తం బాహుబ‌లి-2 చిత్రాన్ని పోలి ఉంద‌ని చెప్పారు. బాహుబ‌లిని వెన్న‌నుపోటు పొడిచిన క‌ట్ట‌ప్ప... సీఎం కేసీఆర్ అయితే... త్వ‌ర‌లోనే తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే బాహుబ‌లి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచే వ‌స్తార‌ని, అయితే ఈ నేత ఏ కొత్త నేతో కాద‌ని చెప్పిన ఆమె... త‌మ‌లోనే ఎవ‌రో ఒక‌రు బాహుబ‌లి అవ‌తారం ఎత్తుతార‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌తో నిన్న‌టి జానారెడ్డి బాహుబ‌లి వ్యాఖ్య‌ల‌కు డీకే మ‌రింత ఘాటు పెంచేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/