Begin typing your search above and press return to search.

డీకే ట్రాక్ రికార్డ్‌: టీడీపీ.. కాంగ్రెస్‌.. తాజాగా బీజేపీ

By:  Tupaki Desk   |   20 March 2019 7:53 AM GMT
డీకే ట్రాక్ రికార్డ్‌: టీడీపీ.. కాంగ్రెస్‌.. తాజాగా బీజేపీ
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగే నేత‌గా గుర్తింపు పొందిన డీకే అరుణ‌.. తాజాగా బీజేపీలో చేర‌టం తెలిసిందే. డీకే పేరు విన్నంత‌నే కాంగ్రెస్ పార్టీ నేత‌గా ప్ర‌జ‌లు గుర్తుకు వ‌స్తుంది. కానీ.. ఆమె టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరార‌న్న విష‌యం స‌మకాలీన రాజ‌కీయాల్నిఫాలో అయిన వారికి తెలియ‌ద‌నే చెప్పాలి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రాష్ట్ర మంత్రిగా చ‌క్రం తిప్పిన ఆమె.. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా రాజ‌కీయాల్ని గ‌డిచిన కొన్నేళ్లుగా ప్ర‌భావితం చేస్తున్నార‌ని చెప్పాలి.

పాల‌మూరు జిల్లా అన్నంత‌నే ఆమె త‌ర్వాత మ‌రే నేత అయినా అన్న‌ట్లుగా ఆమె త‌న అధిక్య‌త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటారు. టీఆర్ఎస్ తొలి ఐదేళ్ల పాల‌న‌లో డీకే అరుణ రాజ‌కీయంగా చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని చెప్పాలి. టీఆర్ఎస్ స‌ర్కారు ప‌వ‌ర్లోకి వ‌చ్చాక‌.. ఆమె రాజ‌కీయంగానే కాదు.. వ్యాపార ప‌రంగానే ఇబ్బందులు ఎదురైన‌ట్లుగా ఆమె వ‌ర్గీయులు చెబుతారు. మొండిత‌నం.. ప‌ట్టుద‌ల‌..స‌మ‌స్య‌ల‌కు త‌ల‌వంచ‌ని తీరుతోపాటు.. ప్ర‌త్య‌ర్థి విసిరే స‌వాళ్ల‌కు స‌లాం చేయ‌టం ఆమెకు చేత‌కాదంటారు.

ట‌ఫ్ ఉమెన్ గా పేరున్న డీకే అరుణ ఎంత‌టి వాగ్ధాటి ఉన్న నేత అన్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాజాగా బీజేపీలో చేరిన ఆమె పొలిటిక‌ల్ కెరీర్ నుచూస్తే.. ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని చెప్పాలి. 1996లో టీడీపీ నుంచి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోక్ స‌భ స్థానానికి తొలిసారి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు.

ఆ త‌ర్వాత మూడేళ్ల‌కు అంటే 1999లో గద్వాల అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడారు. త‌ర్వాత 2004.. 2009.. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకున్నారు. వైఎస్.. రోశ‌య్య‌.. కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాల‌లో మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఓట‌మిపాల‌య్యారు. అప్ప‌టి నుంచి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాల‌ని భావించారు. అయితే.. జైపాల్ రెడ్డి ఆ స్థానం మీద క‌న్నేశారన్న వార్త‌లు వ‌చ్చాయో.. త‌న‌కు బ‌దులుగా వంశీచంద్ రెడ్డి పేరును పార్టీకి ఆమె సూచించిన‌ట్లుగా చెబుతున్నారు. అయితే.. పార్టీ ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన త‌ర్వాత అనూహ్యంగా బీజేపీలో చేరి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.