చిన్నమ్మ దెబ్బకు రూప రోడ్డుపాలైందే!

Mon Jul 17 2017 16:17:59 GMT+0530 (IST)

తమిళ తంబీలు చిన్నమ్మగా పిలుచుకునే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ హవా... తమిళనాడుకే పరిమితం కాలేదండోయ్. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఆమె హవా నడుస్తోందని చెప్పేందుకు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనం వెలుగు చూసింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలకు శశికళే కేంద్ర బిందువుగా మారారు. జయ స్థానంలో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు దక్కించుకున్న శశికళ... జయ కూర్చున్న సీఎం పీఠాన్ని కూడా హస్తగతం చేసుకునేందుకు యత్నించారు. అయితే అనుకోని కారణాలతో ఆమె సీఎం పీఠానికి దూరంగా జరిగి తనకు విశ్వాసపాత్రుడిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి సమయం కోసం ఎదురు చూద్దామనుకున్నారు. ఈలోగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శశికళ దోషిగా తేలడం జైలు శిక్ష ఖరారు కావడం తన నెచ్చెలి జయ కారాగార వాసం చేసిన బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకే ఆమె వెళ్లడం ఒకదాని వెంట ఒకటి చాలా వేగంగా జరిగిపోయాయి.

శశికళ ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు గానీ... కర్ణాటక ప్రభుత్వం కూడా ఆమెను అన్ని విధాలా బాగానే చూసుకునేందుకు ఆసక్తి చూపింది. ఈ క్రమంలోనే జైల్లో ఉన్నా కూడా శశికళకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ లభించింది. జైల్లో ఉన్నారన్న మాటే గానీ... తన ఇంటిలో ఉండగా ఎలాంటి జీవితాన్ని గడిపిందో... పరప్పన అగ్రహార జైల్లో కూడా శశికళ అదే తరహా జీవితాన్ని గడిపింది. దీనికి సంబంధించి ఆ జైలు అధికారిగా పనిచేస్తున్న కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రూప ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ప్రభుత్వానికి నివేదిక పంపిన రూప... జైళ్ల శాఖ డీజీ సత్యనారాయణరావే ఇందుకు కారణంగా నిలిచారని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. రూప లేఖపై ఒక్క తమిళనాడు కర్ణాటకల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే పొరుగు రాష్ట్రానికి చెందిన కీలక రాజకీయ నేతకు తమ రాష్ట్రంలోని జైల్లో దక్కిన వీవీఐపీ ట్రీట్ మెంట్ పై కర్ణాటక సర్కారు స్పందించక తప్పలేదు. దీంతో శశికళకు నిబంధనలకు విరుద్ధంగా అన్ని సౌకర్యాలను కల్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యనారాయణరావును బదిలీ చేసింది.

అంతేకాకుండా... జైల్లో జరుగుతున్న అక్రమాలను నిర్భయంగా బయటపెట్టిన డీఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారిణి అయిన రూపను అభినందించాల్సింది పోయి... ఆమెపైనా బదిలీ వేటు వేసింది. అయితే ఇప్పటికే పరువంతా బజారున పడిందని భావించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య... సత్యనారాయణరావు రూపలతో పాటు మరికొంతమంది సీనియర్ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణరావుకు పోస్టింగ్ ఇవ్వని సిద్దూ సర్కారు... రూపను మాత్రం జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ విభాగంలో డీఐజీగా నియమించి నిజంగానే ఆమెను రోడ్డున పడేసిందన్న వాదన వినిపిస్తోంది. ఎతావతా చెప్పొచ్చేదేమంటే... తమిళనాట కొంతకాలం పాటు చక్రం తిప్పిన శశికళ... పొరుగు రాష్ట్రం కర్ణాకటలోనూ హవా చూపించేసిందన్న మాట. ఎంతైనా తమ వర్గానికే (రాజకీయ వర్గం) చెందిన నేత అనుకున్నారో ఏమో తెలియదు గానీ... శశికళ వీవీఐపీ ట్రీట్ మెంట్ ను బయటపెట్టిన రూపను కర్ణాటక సీఎం సిద్దరామయ్య నిజంగానే రోడ్డున పడేశారన్న వాదనా వినిపిస్తోంది.