Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ దందాలో క‌ల‌క‌లం!..ఖాకీల‌కు పాత్ర ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   22 July 2017 12:03 PM GMT
డ్ర‌గ్స్ దందాలో క‌ల‌క‌లం!..ఖాకీల‌కు పాత్ర ఉంద‌ట‌!
X
తెలుగు రాష్ట్రాల‌ను ప్ర‌త్యేకించి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ టాలీవుడ్‌ను అత‌లాకుత‌లం చేసేస్తున్న డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వ‌స్తోంది. టాలీవుడ్‌లోని టాప్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తో పాటు టాప్ కెమెరామెన్ శ్యాం కే నాయుడు, ప్ర‌ముఖ కేరెక్ట‌ర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు ఇప్ప‌టికే సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కాగా... నేటి ఉద‌యం యువ హీరో త‌రుణ్ కూడా సిట్ కార్యాల‌యానికి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. సినీ ప్ర‌ముఖుల‌కు సంబంధించిన విచార‌ణ‌కు సంబంధించి గంట‌కో కొత్త వార్త వెలుగులోకి రావ‌డం, దానిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌టం ఇప్పుడు మ‌నం చూస్తున్న‌దే.

అయితే ఈ తంతు అంతా హైద‌రాబాదులో జ‌రుగుతుండ‌గా, తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప‌రిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌ర్ గా సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి అకున్ స‌బ‌ర్వాల్ ఈ ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక కేసుతో పాటు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)లో ఉన్న అధికారులంతా కూడా తెలంగాణ పోలీసు, ఎక్సైజ్ శాఖ‌కు చెందిన వారే ఉన్నారు. ఈ వ్య‌వ‌హారంతో ఏపీ ప్ర‌భుత్వానికి గానీ, ఏపీ పోలీసు శాఖ‌కు గానీ, ఏపీ ఎక్సైజ్ శాఖ‌కు గానీ కించిత్ కూడా సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకున్నా కూడా... పొరుగు రాష్ట్రంలో మ‌న‌మంతా మొన్న‌టిదాకా ఉన్న న‌గ‌రం హైద‌రాబాదులో జ‌రుగుతున్న ఈ తంతుపై మ‌న పోలీసులు స్పందించ‌కుండా ఉండ‌లేరు క‌దా.

అందుకు భిన్నంగా ఈ వ్య‌వ‌హారంపై ఏపీకి సంబంధించిన ఒక్క పోలీసు అధికారి కూడా స్పందించిన దాఖ‌లా లేదు. అయితే తాజాగా ఈ విష‌యంపై ఏపీ పోలీసు శాఖ చీఫ్‌, ఆ రాష్ట్ర డీజీపీగా ఉన్న నండూరి సాంబ‌శివ‌రావు కాస్తంత ఘాటుగానే స్పందించారు. స్పందించ‌డంతోనే స‌రిపెట్ట‌ని ఆయ‌న ఏకంగా పెను క‌ల‌క‌ల‌మే రేపే కామెంట్లు చేశారు. చిత్తూరు జిల్లా తిరుప‌తి వెళ్లిన సంద‌ర్భంగా కాసేప‌టి క్రితం తిరుచానూరులోని ప‌ద్మావ‌తీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న నండూరి... అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ డ్ర‌గ్స్ దందాపై సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని ఆయ‌న‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చేనును కంచె మేసినట్లు ప్రలోభాలకు లొంగిపోయి పలువురు పోలీసులు డ్రగ్స్‌ వ్యవహారంలో తలదూర్చారని ఆయ‌న అన్నారు. పరిధిని దాటి డ్రగ్స్‌ వ్యవహారం వెళుతోందని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో గ‌తంలోనూ విచార‌ణ‌లు జ‌రిగాయ‌ని చెప్పిన ఆయ‌న‌, ఏపీలో డ్రగ్స్‌ కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేశార‌ని అన్నారు. తాము ఎక్సైజ్‌ శాఖతో కలిసి డ్ర‌గ్స్‌ నివారణకు ఓ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని నండూరి తెలిపారు.