Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ రండి..శిరీష మృతిపై క్లారిటీ ఇస్తాం

By:  Tupaki Desk   |   27 Jun 2017 4:17 PM GMT
హైద‌రాబాద్ రండి..శిరీష మృతిపై క్లారిటీ ఇస్తాం
X
బ్యూటిషియన్ శిరీష మృతిపై ఎవరు సందేహాలు లేవనెత్తినా నివృత్తి చేస్తామని నగర పశ్చిమ మండల డీసీసీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీష ఆత్మహత్య కేసు విషయంపై ఆయన మాట్లాడుతూ.. శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. 12వ తేదీ రాత్రి కుకునూరుపల్లి ఎస్‌ ఐ గదిలో నలుగురున్నట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. కుకునూరుపల్లి పీఎస్‌ కు సమీపంలో ఫామ్‌హౌస్ ఉంది. కానీ ఫామ్‌ హౌస్‌ లో ముగ్గురు ఉన్నట్లు కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

ఫామ్‌ హౌస్‌ లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించామని.. ఫామ్‌ హౌస్‌ కు ముగ్గురు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నమోదు కాలేదని డీసీపీ వెంక‌టేశ్వ‌ర్ రావు చెప్పారు. శిరీష వస్తువులను ల్యాబ్‌ కు పంపినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇద్దరిని కస్టడీలోకి తీసుకుని విచారించామన్నారు. ఈ కేసులో తేజస్విని వాంగ్ములాన్ని నమోదు చేశామని పేర్కొన్నారు. ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని డిసిపి తెలిపారు. కేసును తాము తప్పుదోప పట్టిస్తున్నామనే విమర్శలు సరికాదని చెబుతూ, ఆ విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

అయితే శిరీష కుటుంబ స‌భ్యులు మాత్రం ఆమెది ఆత్మ‌హ‌త్య కానే కాద‌ని ఆరోపిస్తున్నారు. శిరీషను హత్య చేశారని సంఘ‌ట‌న‌లోని ప‌రిణామాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంద‌ని ఆమె పిన్ని ఆరోపించారు. శిరీష ఆత్మహత్య ఘటన అనంతరం ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను ఆమె భర్త పోలీసులకు ఇచ్చాడని, అయితే కారులో ఉన్న మరొకరి హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని శిరీష పిన్ని ప్ర‌శ్నించారు. ఈ కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారించేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఆరు అడుగుల మనిషి ఫ్యాన్ కు వేలాడితే ఫ్యాన్ రెక్కలు కనీసం వంగిపోవా అని ప్ర‌శ్నించారు. అలాగే ఫ్యాంటు, షర్టు వేసుకున్న శిరీష దగ్గరకి చున్నీ ఎలా వచ్చిందని ఆమె నిలదీశారు.

కాగా, శిరీష ఆత్మహత్య కేసులో పోలీస్ కస్టడీ ఎదుర్కొంటున్న రాజీవ్ రోజుకో సంచలన విషయాన్ని బయటపెడుతున్నాడు. శిరీష క్షణికావేశంలోనే ఆత్మహత్య చేసుకుందన్న రాజీవ్ అందుకు దారితీసిన కారణాలను ఒక్కొక్కటిగా పోలీసుల విచార‌ణలో వివరించాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న తేజస్విని ఒకవైపు.. ప్రొఫెషన్ లో పరిచయమైన శిరీష ఒకవైపు ఉండ‌టంతో వీరిద్దరి మధ్యా నలిగిపోయాన‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలోనే ఇద్దరినీ వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనే కుకనూర్ పల్లి పీఎస్‌ కు వెళ్లాన‌ని వివ‌రించాడు.

అయితే ప్రేమిస్తున్నానంటూ చెప్తున్న తేజస్విని గనక లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎఫ్ ఐఆర్ నమోదు అయితే తమకు అనుకూలంగా కేసును తిప్పాలంటూ ఎస్సై ప్రభాకర్ ద్వారా బంజారాహిల్స్ సీఐ హరీందర్‌కు ఫోన్ చేయించినట్లు తెలిపాడు. ప్రభాకర్‌ తో తేజస్వినికి వార్నింగ్ ఇప్పించేందుకే కుకనూర్ పల్లి వెళ్లినట్లు.. కానీ అక్కడ సీన్ రివర్సయిందనీ రాజీవ్ తెలిపాడు. శిరీష ఆత్మహత్యకు ముమ్మాటికీ ఎస్సై ప్రభాకరే కారణమని ఆరోపించారు. మరోవైపు ఈ వివాదానికి కారణమైన తేజస్వినిని కూడా పోలీసులు విచారించారు.. శిరీషకు తనకు గొడవలున్న మాట నిజమేనని కానీ ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని తేజస్విని చెప్పినట్లు తెలుస్తోంది. రాజీవ్ ను పెళ్లాడాలనుకున్నట్లు.. కానీ అందుకు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని కూడా తేజస్విని చెప్పినట్లు స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/